సినిమా నటుల టాలెంటుకు అవార్డులే కొలమానం కాదు. ప్రత్యేకించి భారతదేశంలో సినీనటులు రాజకీయాల్లో తల దూర్చిన దగ్గర నుంచి అవార్డుల విషయంలో జనాలకు నమ్మకాలు సన్నగిల్లాయి. ఇక గత కొన్ని దశాబ్దాల్లో అయితే సినీ అవార్డులు పూర్తిగా రాజకీయమయం అయ్యాయనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇది వరకూ అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సినీ అవార్డుల విషయంలోనే విమర్శలొచ్చేవి. ఇప్పుడు కేంద్రం ఇచ్చే సినీ అవార్డుల పరిస్థితి ఇంతే!
ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు దక్కిన దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు పట్ల చిత్ర పరిశ్రమ సంతోషంగా స్పందిస్తూ ఉంది. రజనీని వరించిన ఈ అవార్డు పట్ల పలువురు చిత్రరంగ ప్రముఖులు స్పందించారు. రజనీని అభినందించారు. ఆయనకు ఈ పురస్కారం దక్కడం తమకు సంతోషమన్నారు. ఇది వరకూ ఈ పురస్కారాన్ని అందుకున్న ప్రముఖులతో పోలిస్తే రజనీకాంత్ కూడా జనాదరణ ఉన్న నటుడే. తమిళనాట రజనీ మాస్ మానియా గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే జనాదరణే ఈ అవార్డుకు ప్రాతిపదికే అనుకుంటే రజనీకాంత్ వందకు వందశాతం ఆ పురస్కారానికి అర్హుడు.
కట్ చేస్తే.. ఈ పురస్కారం ఇచ్చిన వేళా విశేషం మాత్రం రాజకీయ దుమారాన్ని రేపుతూ ఉంది. సరిగ్గా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు వేళ అవుతున్న సమయంలో రజనీకాంత్ కు ఈ అవార్డును ప్రకటించడం రాజకీయ విమర్శలకు దారి తీస్తోంది. తమిళనాట రజనీకాంత్ అభిమానులు అయిన ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఈ అవార్డును ఉపయోగించుకుంటున్నారు కమలం పార్టీ వాళ్లు అనే విమర్శ చాలా సులువుగా వస్తోంది.
అసలే రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చీ రానట్టుగా వ్యవహరించారు. వచ్చేసినట్టే అని ఆయన ప్రకటించిన సమయంలో ఆయన అభిమానులకు పూనకం వచ్చింది. ఇక అంతిమంగా రజనీకాంత్ పాలిటిక్స్ కు నో చెప్పారు. ఈ తరుణంలో ఎన్నికల వేళ రజనీకాంత్ తన అభిమానులకు ఓటు విషయంలో ఏం పిలుపులు ఇస్తారో, ఇవ్వరో కానీ.. ఈ అవార్డు ద్వారా బీజేపీ రజనీకాంత్ ఫ్యాన్స్ కు గట్టిగానే గేలం వేసింది. ఈ గేలానికి ఎన్ని ఓట్లు, సీట్లు పడతాయో కానీ, ఇకపై రజనీకాంత్ కు ఈ అవార్డు అనే చర్చ వచ్చినప్పుడల్లా మాత్రం తమిళనాడు ఎన్నికల సందర్భంగా ఆయనకు ఆ పురస్కారాన్ని ప్రకటించారనే అంశం కూడా తప్పక చర్చకు వస్తుంది!