తాము చెప్పిందల్లా నమ్మే కాలం పోయిందని టీడీపీ యువకిశోరం నారా లోకేశ్ ఇంకా గుర్తించడం లేదు. తాను ఎదగక, ఎదుటి వాళ్లు తనలాగే అనే భ్రమల్లో ఆయన ఉన్నారనే విమర్శలు లేకపోలేదు. ఎప్పటికప్పుడు తనను తాను ఫూల్ చేసుకోవడంలో లోకేశ్‌కు లోకేశే సాటి అని చెప్పక తప్పదు.
తాజాగా ఏప్రిల్ ఫూల్ ట్వీట్ చేశారాయన. తాను ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నాననే స్పృహ కోల్పోయి, జగన్‌ను విమర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
“మోడీ మెడ వంచి తెస్తానన్న ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టిన ఫేక్ సీఎం గారూ! ఇప్పుడు బీజేపీ పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామంటోంది. ఏపీకి ముగిసిన అధ్యాయమైన ప్రత్యేక హోదా పుదుచ్చేరిలో ఎలా మొదలవుతుందో?. రాష్ట్రంలో కమలంతో రహస్య ప్రయాణాన్ని కట్టి పెట్టేసి, పుదుచ్చేరిలో బీజేపీ మిత్రుల గెలుపు కోసం వైసీపీ నాయకులతో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. వైఎస్ జగన్… మీ కేసుల గురించి కాకుండా కాస్త ప్రత్యేక హోదా కోసం ఇప్పటికైనా గట్టిగా అడగండి” అని లోకేశ్ ట్వీట్ చేశారు.
దాదాపు నాలుగేళ్ల పాటు కలిసి అధికారం పంచుకున్న చరిత్ర బీజేపీ-టీడీపీది. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలో ఉన్నంత కాలం ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అంటూ ప్రశ్నించిన నోటితోనే …ఇప్పుడు బీజేపీని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీస్తుండడం కలికాలం మహిమ కాబోలు.
ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకివ్వడం లేదని మోడీ సర్కార్‌ను ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా తమపై ఉందని లోకేశ్ మరిచిపోయినట్టున్నారు. ప్రతిదాన్ని జగన్‌తో సంబంధాలు అంటగడుతూ, బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టడం లోకేశ్‌కు, టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. పుదుచ్చేరిలో బీజేపీ మిత్రుల గెలుపు కోసం వైసీపీ నాయకులతో విస్తృత ప్రచారం చేస్తున్నారనే విమర్శతో … పక్క రాష్ట్రంలో కూడా వైసీపీ మాట చెల్లుబాటు అవుతుందని లోకేశ్ చెప్పదలుచుకున్నారా?
జగన్‌పై కేసులుండడం వల్లే ప్రశ్నించలేరని అనుకుందాం. మరి తమరికి ఏ భయం లేనప్పుడు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీని నిగ్గదీసి అడిగేందుకు భయమెందుకో సమాధానం చెప్పు లోకేశ్ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. లోకేశ్ ఇలా ట్వీట్లు, విమర్శలు చేస్తున్నంత కాలం వైసీపీ ఎలాంటి చీకూచింతా లేకుండా కాలం గడపొచ్చు. ఎందుకంటే టీడీపీకి లోకేశ్ భారం కావచ్చేమో కానీ, వైసీపీకి మాత్రం లాభం. ఇందుకు లోకేశ్ తాజా ట్వీటే నిదర్శనం.