Advertisement

Advertisement


Home > Movies - Movie News

పండగ రేస్ నుంచి సినిమాలు అవుట్

పండగ రేస్ నుంచి సినిమాలు అవుట్

నిన్న మొన్నటి దాకా సంక్రాంతి 2021 కు సినిమాలు వరుసగా క్యూ కట్టే పరిస్థితి. కానీ ఇప్పుడు మళ్లీ అంతా మారిపోయింది. రెండు సినిమాలు మినహా మిగిలిన సినిమాలు ఏవీ పండగ బరిలోకి దిగే సూచనలు కనిపించడం లేదు. 

రవితేజ-టాగోర్ మధుల క్రాక్, యువి నిర్మించిన చిన్న సినిమా ఈ రెండే సంక్రాంతి బరిలోకి వస్తున్నాయి. యాభై శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు విడుదల చేయడం కష్టమనే ఆలోచనే ఇందుకు కారణం.

ఆసియన్ సునీల్ నిర్మించిన నాగ్ చైతన్య లవ్ స్టోరీ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లే. ఆ సినిమాను ఓవర్ సీస్ హక్కులు 5.50 కోట్లకు విక్రయించారు. 

ఇప్పుడు అక్కడ విడుదల చేసే పరిస్థితి లేదు. సంక్రాంతికి విడుదల చేస్తే ఈ అయిదున్నర కోట్లు వదులుకోవాలి. పైగా ఫిఫ్టీ పర్సంట్ ఆక్యుపెన్సీ అంటే కిట్టదు కూడా. అందుకే ఏప్రియల్ కు విడుదల మార్చుకుంటున్నారు.

అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ కాబినేషన్ లో నిర్మించిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఈ సినిమాకు కాస్త ఖర్చు ఎక్కువే అయింది. పైగా యాభై శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు విడుదల చేయడం అన్నది అల్లు అరవింద్ కు అంతగా ఇష్టం లేదు. అందుకే ఆ సినిమాను కూడా సంక్రాంతి బరి నుంచి తప్పించారు.

నితిన్ తో నాగవంశీ నిర్మించిన వెంకీ అట్లూరి సినిమా రంగ్ దే. ఈ సినిమాను ఓటిటికి బేరాలు చేస్తున్నారు. మరోపక్క అలా కుదరకపోతే ఫిబ్రవరి లో థియేటర్ లలోకి పంపాలనుకుంటున్నారు. అందువల్ల ఈ సినిమా కూడా సంక్రాంతి రేస్ లో లేదు.

రామ్ లేటెస్ట్ సినిమా రెడ్. ఈ సినిమా విషయంలో నిర్మాత రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. హీరో రెమ్యూనిరేషన్ కాకుండా ఈ సినిమాకు 12 కోట్లకు కాస్త అటుగా ఖర్చుయినట్లు బోగట్టా. అందువల్ల పెద్దగా టెన్షన్ లేదు. 

అందుకే మంచి రేటు వస్తే ఓటిటి లేదా అంటే 100 శాతం ఆక్యుపెన్సీ వచ్చాక విడుదల చేయాలనుకుంటున్నారు. మొన్నటికి వరకు సంక్రాంతికి అని డిస్ట్రిబ్యూటర్లకు కూడా చెప్పారు కానీ ప్రస్తుతం మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఇక పవన్ వకీల్ సాబ్ క్వశ్చనే లేదు. నిర్మాత దిల్ రాజు ఏప్రియల్ లో విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు. భవ్య నిర్మించి నితిన్ చెక్ సంగతి ఇంకా ఏమీ తెలియదు.

ఓటిటి కి వెళ్తుందా? థియేటర్ కు వస్తుందా? అన్నది తెలియాల్సి వుంది. మొత్తం మీద ఈ సారి సంక్రాంతికి సినిమాల హడావుడి పెద్దగా వుండదు. 

చంద్రబాబు కామెడీ లెక్చర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?