ఇటు రేణు దేశాయ్.. అటు పూనమ్ కౌర్.. వీళ్లిద్దరు ఏ పోస్టు పెట్టినా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ భుజాలు తడుముకుంటారు. వీళ్లు పెట్టే ప్రతి పోస్టును తమ నాయకుడు/హీరోకు అన్వయించుకుంటారు. ఆ వెంటనే వీళ్లపై ట్రోలింగ్ కూడా షురూ చేస్తారు. ఇప్పటికే ఇలా చాలా సార్లు జరిగింది. ఇప్పుడు మరోసారి రేణు దేశాయ్, పూనమ్ కౌర్ పోస్టులు పెట్టారు.
ముందుగా రేణుదేశాయ్ విషయానికొద్దాం.. చాన్నాళ్ల తర్వాత ఆమె తన సోషల్ మీడియా ఎకౌంట్ డ్యాష్ బోర్డ్ చెక్ చేసిందట. దానికి సంబంధించి స్క్రీన్ షాట్ కూడా పెట్టింది. ఆ డాష్ బోర్డ్ చూసిన తర్వాత ఆమె రియాక్షన్ ఏంటో చూద్దాం..
“చాలా కాలం తర్వాత డ్యాష్ బోర్డ్‌ని చెక్ చేశాను. నన్ను అనుసరించకుండా, నా ఎకౌంట్, నా పోస్టులు చెక్ చేసే వాళ్లు చాలామంది ఉన్నారు. దాదాపు 10 లక్షల మంది నన్ను ఫాలో అవ్వకుండానే నా ఎకౌంట్ చూస్తున్నారు. ప్రత్యేకంగా నా ప్రొఫైల్‌ను కొంతమంది శోధిస్తున్నారు. నన్ను ఫాలో అవ్వకుండా, నా ఎకౌంట్ ను అంతలా చెక్ చేస్తున్నది ఎవరో గట్టిగా ఆలోచించాల్సిన విషయమే.”
రేణు దేశాయ్ పెట్టిన ఈ పోస్టు చూసి చాలామంది పవన్ ఫ్యాన్స్ భుజాలు తడుముకుంటున్నారు. పవన్ ఫ్యాన్స్ మాత్రమే ఆమెను ఫాలో అవ్వకుండా, ఆమె పెట్టిన పోస్టుల్ని చదువుతున్నారనేది చాలామంది ఫీలింగ్. రేణు మాత్రం ఎక్కడా ఎవరి పేరు ప్రస్తావించలేదు.
ఇక పూనమ్ కౌర్ విషయానికొద్దాం.. కొద్దిసేపటి కిందట ఈమె కూడా ఓ పోస్టు పెట్టింది. ఓ మనిషికి తీవ్రవాద దృక్పథం ఎలా వస్తుందో, తనదైన విశ్లేషణ ఇచ్చింది.
“మనసు పొరల్లో లోతుగా పేరుకుపోయిన భయం వల్ల తీవ్రవాద దృక్పథం ఏర్పడుతుంది. అంతర్గతంగా ఉన్న అభద్రతాభావం, ఇతరుల ప్రాధమిక హక్కుల్ని తిరస్కరించడం నుంచి భయం ఏర్పడుతుంది. ఆ నిస్సహాయత నుంచి హింస చెలరేగుతుంది. అటువంటి భయాన్ని, అభద్రతా భావాన్ని ప్రజలు సమిష్టిగా ఎదుర్కోవాలని నేను ప్రార్థిస్తున్నాను.”
ప్రస్తుతం పవన్, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. తీవ్రవాద దృక్పథాన్ని చూపిస్తున్నారు. కాబట్టి పూర్తిగా పవన్ ను దృష్టిలో పెట్టుకొని పూనమ్ ఆ ట్వీట్ చేసి ఉంటుందని పవన్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇటు రేణు దేశాయ్ పై, అటు పూనమ్ కౌర్ పై మరోసారి ఓ మోస్తరుగా ట్రోలింగ్ మొదలైంది.