పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ ఓ కొత్త విషయం వెల్లడించారు. గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ అమెరికాలోని ఓ సామాజిక వర్గం బ్రో సినిమా కంటెంట్‌ను బ్యాడ్ చేసే ప్రయత్నం చేసిందని చెప్పారు. బ్రో సినిమా పాటలు అప్ టు ది మార్క్ లేవన్న అభిప్రాయం జనాల్లో బలంగా వుందన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, 70 నుంచి ఎనభై శాతం బాగున్న కంటెంట్ ను కూడా పని గట్టుకుని యుఎస్ లోని ఓ వర్గం ట్రోల్ చేసిందని చెప్పారు. ఓ సాఫ్ట్ వేర్ సంస్థ అధినేతగా ఈ ట్రోల్స్ ఎక్కడ నుంచి ఏ ఐపి నుంచి, ఏవిధంగా జరిగాయన్నది తాను తెలుసుకున్నానని చెప్పారు.
బ్రో సినిమా మాస్ మసాలా సినిమా కాదని, సకుటుంబంగా చూసే మంచి సినిమా అని చెప్పారు. ఫ్యాక్టరీ మోడ్ లో సినిమాలు తీసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, ఇలా బల్క్ గా సినిమాలు చేయడం వల్ల టోటల్ గా బ్యాలన్స్ షీట్ నష్టాల్లో వుండదని చెప్పారు. పెద్ద సినిమాలకు రిస్క్ చేసినా, పెద్దగా ఇబ్ళంది వుండదన్నారు.
అతి వేగంగా వంద సినిమాలు చేయడం లక్ష్యమని, ఇప్పటికే 50 సినిమాల మార్క్ ను చేరడం చాలా దగ్గరలో వుందని విశ్వప్రసాద్ చెప్పారు. సినిమాల్లోకి రావడానికి ముందుగా అమెరికాలో చాలా గ్రౌండ్ వర్క్ చేసామని, సినిమా ఇన్ ఫా స్ట్రక్చర్ రంగంలోకి వచ్చి, తరువాత నిర్మాణ రంగంలోకి దిగామన్నారు.
పవన్ ఐడియాలజీ ఇష్టం.
పవన్ కళ్యాణ్ తో ఎప్పటి నుంచో పరిచయం వుందని, ఓ బేబీ టైమ్ లోనే సినిమా ఒకటి చేయాలని అనుకున్నామని అన్నారు. పార్టీ రాజకీయాలతో సంబంధం లేకుండా తనకు పవన్ ఐడియాలజీ ఇష్టమని అన్నారు. రాజకీయాలు ఇష్టమే అని, కానీ పార్టీలతో సంబంధం లేదని అన్నారు. భవిష్యత్ ఏ పదవులు ఆశించడం లేదన్నారు. నాదెండ్ల మనోహర్ తనకు చిరకాల పరిచయం అని, దానికీ ఈ సినిమాకు సంబంధం లేదని అన్నారు.
హాలీవుడ్ సినిమా
త్వరలో రెండు హాలీవుడ్ సినిమా నిర్మాణం కూడా ప్రకటించబోతున్నామని, 2024లో 10 పాన్ ఇండియా సినిమాలు తమ బ్యానర్ నుంచి వస్తాయన్నారు. గూఢచారి 2 సినిమా చాలా భారీ పాన్ ఇండియా సినిమా అవుతుందన్నారు. ప్రభాస్-మారుతి సినిమా విడుదల ఎప్పుడు వుండొచ్చు అన్నది తాను చెప్పలేనని అన్నారు. సమయం వచ్చినపుడు ఆ సినిమాను అఫీషియల్ గా ప్రకటిస్తామన్నారు.
మహేష్ బాబు, బన్నీ ఇలా అందరితో సినిమా చేయాలనే వుందని, కానీ డేట్ లు దొరకాల్సి వుందని అన్నారు. త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా చేయాలని తమకూ వుందని, ఆయన కూడా సానుకూలంగానే వున్నారని వెల్లడించారు.