వైసీపీ విశాఖ జిల్లా కొత్త ప్రెసిడెంట్ ని పార్టీ తాజాగా నియమించింది. విశాఖ డీసీసీబీ చైర్మన్ గా రెండు రోజుల క్రితం నియమితులు అయిన విశాఖ సౌత్ నియోజకవర్గనికి చెందిన కోలా గురువులుని కొత్త సారధిగా ఎంపిక చేశారు.
మత్స్యకార సామాజికవర్గానికి చెందిన గురువులుకు జగన్ ఎన్నో అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వైసీపీ టికెట్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక స్టేట్ ఫిషరీస్ డెవెలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు.
ఆ మధ్య ఎమ్మెల్సీ టికెట్ ని ఎమ్మెల్యే కోటాలో ఇస్తే ఒక్క ఓటు తేడాలో కోలా గురువులు ఓడారు. ఆయనకు డీసీసీబీ చైర్మన్ గా ప్రభుత్వ పదవి ఇస్తూ ఇటు పార్టీ కీలక బాధ్యతలు సైతం అప్పగించారు. అది కూడా నిన్నటిదాకా వైసీపీ ప్రెసిడెంట్ గా ఉన్న పంచకర్ల రమేష్ బాబు జనసేన కండువా కప్పుకున్న గురువారం నాడే కోలా గురువులు నియామకం జరిగింది. పార్టీలో ఎందరో లీడర్లు ఉన్నారని, పార్టీ మొదటి నుంచి ఉన్న వారు అనేకమంది ఉన్నారని వైసీపీ పెద్దలు అంటున్నారు.
ఒకరు వెళ్తే మరొకరు తమ పార్టీలో రెడీగా ఉంటారని చెప్పేందుకే పంచకర్ల వెళ్ళిన వెంటనే కోలాను నియమించారు అని అంటున్నారు. విశాఖ జిల్లాలో సంప్రదాయ మత్స్యకార వర్గానికి చెందిన గురువులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. పార్టీ పట్ల విధేయత ఆయనకు అనేక పదవులు తెచ్చి పెడుతోంది. ఎన్నికల వేళ గురువులు విశాఖ వంటి ప్రతిష్టాత్మకమైన జిల్లా ప్రెసిడెంట్ గా ముందుకు సాగాల్సి ఉంది అని అంటున్నారు.