కారా మాస్టారును, కథా నిలయాన్ని విడదీసి చూడలేం. లక్షలాది కథలకు నెలవైన కథానిలయాన్ని వీడి కారా మాస్టారు వెళ్లిపోయారు. వెల కట్టలేని, లెక్కకు అందని అపారమైన తెలుగు సంపదను మనకు అందించి, ఆయన తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. ప్రముఖ రచయిత, కథకుడు, విమర్శకుడు, మాజీ ఉపాధ్యాయుడు కాళీపట్నం రామారావు కన్నుమూశారు. తెలుగు భాషను, సంస్కృతిని సుసంపన్నం చేసేలా లక్షలాది కథలతో కొలువైన కథానిలయం సృష్టికర్త ఈయన.
శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ-ఏ కాలనీలో ఉంది రెండస్తుల కథానిలయం. ఆ పక్కనే కారా గారి ఇల్లు. ఉపాధ్యాయుడిగా రిటైరైన డబ్బుతో పాటు.. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కింద లభించిన రివార్డును కలిపి కథానిలయానికి శ్రీకారం చుట్టూరు కారా. మరికొంతమంది సాహితీవేత్తల సహకారంతో ఓం ప్రథమంగా 800 తెలుగు కథల పుస్తకాల్ని ఒక చోట చేర్చి కథానిలయం ప్రారంభించారు.
అలా చిన్నగా ప్రారంభమైన ఈ కథా నిలయం ఇప్పుడు లక్షలాది కథలకు నిలయంగా మారింది. తొలి తెలుగు కథ నుంచి నిన్నటి వార్తాపత్రికలో ప్రచురితమైన కథ వరకు అన్నీ అక్కడ నిక్షప్తమై ఉంటాయి. ఆ రచయితల సమాచారం కూడా పొందుపరిచి ఉంటుంది. ఆ గోడలపై రచయితల ఫొటోలు కూడా కనిపిస్తాయి.
కథల లక్ష్యం పాఠకుడికి వినోదాన్నందించడమే కాదు.. సగటు మానవుడు గ్రహించలేని జీవిత సత్యాల్ని, ప్రాచీన గ్రాంథాల్లోని సారాంశాల్ని అర్థమయ్యే సరళమైన భాషలో విడమర్చి చెప్పడం అంటారు కారా. చరిత్ర ఆనవాళ్లు, అప్పటి పరిస్థితుల మట్టివాసన, ఆచార వ్యవహారాల గుబాళింపు కథల్లో దొరుకుతుందంటారు. అలాంటి కథల్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఉద్దేశంతో కథా నిలయాన్ని మొదలుపెట్టారు.
అటుఇటుగా ఈ కథానిలయం మొదలై పాతికేళ్లు అవుతుంది. కొన్నాళ్ల కిందట డిజిటలైజేషన్ కూడా ప్రారంభించారు. మనసు ఫౌండేషన్ అనే సంస్థ ఆధ్వర్యంలో సగానికి పైగా కథల్ని ఇప్పటికే డిజిటల్ రూపంలోకి తీసుకొచ్చారు. ఎక్కడా దొరకని, అరుదైన, అపురూపమైన కథల్ని కథానిలయంలో పెట్టెలో పెట్టి తాళం వేస్తారు. ఎవరికి పడితే వాళ్లకు ఇవ్వరు. రీసెర్చ్ కోసం వచ్చేవాళ్లకు మాత్రం ఇస్తారు.
ఇలా అన్నీ తానై రెండస్తుల కథానిలయాన్ని (రీడింగ్ రూమ్, లైబ్రరీతో కలిపి) నడిపిస్తూ వస్తున్నారు రామారావు. కారా ఎప్పుడూ గుర్తింపు కోరుకోలేదు. అవార్డులు-రివార్డులు ఆశించలేదు. ఇంకా చెప్పాలంటే ఒక దశలో ప్రభుత్వ విధానాలు నచ్చక సాహిత్య అకాడమీ అవార్డు తిరస్కరించిన వ్యక్తి ఈయన.
ఆయన రచనలు తక్కువే అయినప్పటికీ.. వాటిలో ఎన్నదగినది ''యజ్ఞం''. ఈ రచనపై తెలుగు సమాజంలో జరిగినంత చర్చ బహుశా మరే తెలుగు కథపై జరిగి ఉండదంటారు ఆయన శిష్యుడు యండమూరి వీరేంద్రనాధ్. 1964లో వచ్చిన యజ్ఞం కథ ఫ్యూడల్ విధానంలో దోపిడిని కళ్లకు కడుతుంది. అందుకే కొందరికి అది నచ్చదు.
వారపత్రికలు, మాసపత్రికలు, దినపత్రికలు అనే తేడా లేకుండా తెలుగులో ప్రచురితమైన ప్రతి కథ తన కథానిలయంలో ఉండాలని కోరుకునే వారు కారా. వ్యక్తిగత స్థాయిలో కొంతమంది రాసిన, ప్రచురణకు నోచుకోని కథలకు కూడా చోటిచ్చారీయన. కథ ఎవరు రాశారనేది ఆయన పాయింట్ కాదు. ఆ కథలో విషయం ఉందా లేదా అనేది ముఖ్యం. అదుంటే అక్కడ చోటు దక్కినట్టే. చరిత్రలో నిక్షిప్తం అయినట్టే. ఉపాధ్యాయుడిగా రిటైర్ అయిన తర్వాత తన జీవితం మొత్తాన్ని కథానిలయానికే అంకితం చేశారు ఈ తెలుగు ప్రేమికుడు.
అలా పాతికేళ్లుగా కథాసాగరాన్ని మధించిన కారా, ఆ తెలుగు సుసంపదను మనకు వదిలి వెళ్లిపోయారు. ఆయన ఈ లోకంలో లేకపోయినా.. ఆయన కృషి, రచనలు, విలువలు, కథానిలయం ఎప్పుడూ మనతోనే ఉంటాయి.