ఇంత కాలం కరోనా రిజిస్ట్రేషన్ అంటే లాంగ్వేజీ సమస్య అని భయపడేవాళ్లు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట కరోనా టీకా రిజిస్ట్రేషన్‌ను హిందీతో పాటు మరో 10 ప్రాంతీయ భాషాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో చింతించాల్సిన పనిలేదు.
ఆన్‌లైన్‌లో కరోనా టీకా రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసిన సంగతిని గుర్తు తెచ్చుకోవాలి. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వల్ల నిరక్షరాస్యుల సంగతేంటని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే హిందీ, ఇంగ్లీష్ రానివాళ్ల గురించి కూడా చర్చకు వచ్చింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. కోవిన్ పోర్టల్‌ను ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి తెచ్చినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తెలుగు, మరాఠీ, మలయాళం, పంజాబీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, ఒడియా భాషల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మార్గం సుగుమమైంది. దేశంలో 18ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా పొందాలంటే కొవిన్ పోర్టల్‌లో తప్పని సరిగా నమోదు చేసుకోవాలి. అప్పుడే టీకా ప్రక్రియ సులభమవుతుంది.