ఆంధ్రప్రదేశ్‌లో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు, తెలంగాణలో ఈటల రాజేందర్ రాజకీయంగా బాగా వార్తల్లో నిలిచిన నేతలు. ఇద్దరూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులే. కానీ రాజకీయంగా అనుసరిస్తున్న పంథా డిఫరెంట్‌గా ఉంటోంది. వీరి రాజకీయ అడుగులు గమనిస్తే…నేర్చుకునే నీతి ఏంటో ఎవరికి వాళ్లు తెలుసుకోవాల్సిందే.
దాదాపు ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్‌లో సొంత ప్రభుత్వంపై రఘురామకృష్ణంరాజు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈటల రాజేందర్ విషయానికి వస్తే సీఎం కేసీఆర్‌తో గత కొంత కాలంగా విభేదిస్తూ వస్తున్నారు. అయితే ఇదంతా అంతర్గతంగా సాగుతూ వస్తోంది.
కేబినెట్‌లో ఉంటూ అప్పుడప్పుడు నిరసన గళం విప్పుతున్నారు. ఈ నేపథ్యంలో సహజంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో రఘురామ, రాజేందర్‌లను పోల్చుకుంటూ …నాయకుడంటే ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా చర్చకు వస్తున్న అంశాల గురించి తెలుసుకుందాం.
రఘురామకృష్ణంరాజు… గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి, నరసాపురం ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. అంతకు ముందు ఆయన మారిన పార్టీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎంపీగా గెలుపొంది కొంత కాలం పార్టీ లైన్ లోనే నడిచారు. ఆ తర్వాత పార్టీతో ఎందుకు విభేదాలొచ్చాయో తెలియదు. కానీ, తీవ్రస్థాయిలో జగన్ సర్కార్‌ను తూర్పార పట్టడం స్టార్ట్ చేశారు.
అలాగని పార్టీని వీడుతారా? అంటే… అబ్బే, చచ్చినా వీడేది లేదంటూ భీష్మించారు. చివరికి ఏపీ సీఐడీ పోలీసుల అరెస్ట్ వరకూ దారి తీసింది. కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ అనేక మంది పెద్దలకు ఫిర్యాదు చేశారు, చేస్తున్నారు. వైసీపీ వల్ల అనుభవిస్తున్న ఎంపీ పదవిని వీడేందుకు మాత్రం ముందుకు రారు. మరోవైపు విమర్శలు మాత్రం గుప్పిస్తుంటారు.
ఈటల రాజేందర్ …తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నడిచిన ముఖ్య నేతల్లో ఈయన ఒకరు. అకస్మాత్తుగా కేబినెట్ నుంచి బర్తరఫ్ అయ్యారు. అయినప్పటికీ కేసీఆర్‌పై నోరు జారలేదు. విధానాల పరంగా విమర్శలే తప్ప, ఎక్కడా వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లని విజ్ఞత ఈయనది. తాజాగా టీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేసీఆర్‌తో ఢీకొట్టేం దుకు సిద్ధమైన నేత.
తనకు పదవులు, డబ్బు కంటే ఆత్మాభిమానమే మిన్న అని నిరూపించుకున్న నేత ఈటల. తనను కాదనుకున్న పార్టీ వల్ల దక్కిన ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచతో సమానంగా పీకి విసిరికొట్టారు. ఆత్మాభిమానానికి పర్యాయ పదంగా ఈటల నిలిచారనే గౌరవాన్ని దక్కించుకున్నారు. ఎవరైతే తనను అవమానించారో, వారితో ప్రజాక్షేత్రంలో ఢీకొట్టేందుకు సై అని పార్టీకి, పదవికి రాజీనామాతో సవాల్ విసిరారు.
ఇలా ఏ రకంగా చూసుకున్న రాజేందర్, రఘురామకృష్ణంరాజు పాటిస్తున్న రాజకీయ విలువలకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా. ఒక నాయకుడేమో తన క్యాస్ట్ వెనుకబడిన వర్గానికి చెందిందే తప్ప, క్యారెక్టర్‌లో ఎంత మాత్రం కాదని మీసం మెలేసి మీడియా సాక్షిగా నిరూపించుకున్నారు. మరొక నాయకుడేమో అగ్రకులం పుట్టానని చెప్పడమే తప్ప, చేష్టల విషయానికి వస్తే …అత్యంత దిగువస్థాయికి చెందినవి.
రోషం, పౌరుషం, వ్యక్తిత్వం, ఆత్మాభిమానం లాంటి వాటికి దూరం దూరం అని పదేపదే నిరూపించుకుంటున్న వైనం. ఒక నాయకుడు పాటిస్తున్న విలువలను చూస్తే …పొలిటీషియన్ అంటే ఇలా ఉండాలనే అభిప్రాయం కలిగించారు. ఇంకొకరిని చూస్తే …పొలిటీషియన్ అంటే ఇలా ఉండకూదనే భావనను కలిగిస్తున్నారు. ఆ ఇద్దరు నేతల రాజకీయ పంథా నుంచి గ్రహించాల్సిన నీతి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రజలు చాలా విజ్ఞులు.