ఎట్టకేలకు పవర్‌స్టార్ సినిమా ట్రైలర్ లీక్ అయింది. రూ.25 ఖర్చు చేయకుండానే ఫ్రీగా చూసే అవకాశం కలిగింది. నాలుగు నిమిషాల నాలుగు సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ వైరల్ అవుతూ టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ట్రైలర్ ప్రారంభమే…ఈ చిత్రం ప్రవర్‌కల్యాణ్ ఫ్యాన్స్‌కి అంకితం అంటూ చూపడం ద్వారా వివాదాస్పద, సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకునేందుకు ఈ చిత్రం పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ గురించి కాదని రాంగోపాల్‌వర్మ సాంకేతిక అంశాలు చెబుతున్నప్పటికీ….ముమ్మాటికీ ఇది తమ హీరోని టార్గెట్ చేస్తూ తెరకెక్కించారని పవన్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ మాత్రం అనేక పాత్రలను పరిచయం చేసిందనే చెప్పాలి.
పవన్ పెద్దన్నచిరంజీవి, చిన్నన్న నాగబాబు, రష్యన్ భార్య, ఫూణే నుంచి ఫోన్ అని చెప్పించడం ద్వారా అర్థం చేసుకునే వాళ్లకు చేసుకున్నంత మహదేవ అన్నట్టుగా చిత్రీకరణ చేశారు. ఇంకా చంద్రబాబు, నిర్మాత బండ్ల గణేష్, సినీ క్రిటిక్ కత్తి మహేశ్ పాత్రలను కూడా సందర్భోచితంగా తెరపైకి తీసుకురావడం కనిపిస్తుంది.
ఇక ట్రైలర్‌లో ఓ స్తంభాన్ని గ్లాస్‌తో సుతారంగా కొట్టడం నుంచి పవన్‌ను ప్రేక్షకుల ముందు నిలుపుతారు. ఎన్నికల ఫలితాల వచ్చిన రోజుతో కథ మొదలు పెట్టి ప్రేక్షకుల్ని సినిమా మూడ్‌లోకి లాక్కెళుతారు. ఈజీ చైర్‌లో ముందూ వెనక్కీ ఊగుతూ ఫలితాలను టీవీలో పవన్ చూస్తూ ఉంటారు. భీమవరంలో కూడా పవన్‌కల్యాణ్ ఓటమి దిశగా పయనిస్తున్నారనే సమా చారాన్ని బ్రేకింగ్ న్యూస్‌గా చూపుతారు.
ఎన్నికల్లో ఓటమి పవన్‌లో ఆగ్రహాన్ని కట్టలు తెంచుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ట్రైలర్‌లో చూడాల్సిందే. ఆ తర్వాత చంద్రబాబు పాత్ర ప్రవేశం. “మిమ్మల్ని నమ్మొద్దు…నమ్మొద్దు అని చాలా మంచి చెప్పారని, మీకో దండం సామి, ఫ్లీజ్ సార్ బయల్దేరండి” అని బాబుకు నమస్కారం చేసి, బయటికి పవన్ దారి ఎందుకు చూపారో సమాధానం ట్రైలర్‌లో దొరుకుతుంది.
సినీ క్రిటిక్ కత్తి మహేశ్ పాత్ర కూడా ఇందులో ప్రత్యేకం. జర్నలిస్టుగా పవన్‌ను ఆయన ఏం ప్రశ్నిస్తారో, జనాన్ని పవన్ ఎందుకు తిట్టారో? అలాగే చిన్నన్నయ్య నాగబాబు నుంచి వచ్చిన ఫోన్ కాల్…పవన్‌లో ఎందుకు చిరాకు తెప్పించిందో, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తన దేవుడు పవన్ కల్యాణ్ ఎందుకు ఓడిపోవాలని కోరుకున్నాడో…ఇట్లాంటి ప్రశ్నలన్నింటికి ఈ ట్రైలర్‌లోనే సమాధానం దొరుకుతుంది.
రష్యన్ భార్య సీరియస్‌గా మాట్లాడుతున్న సమయంలో ఫూణే నుంచి ఫోన్ రావడం, దానికి పవన్ చిరాకు పడడం…అబ్బో 4.04 నిమిషాల్లోనే సినిమా చూపినంత పనిచేశాడు రాంగోపాల్‌వర్మ. మొత్తానికి తన మనసును తెరపైకి తెచ్చి…మరోసారి సంచలనం కలిగించాడు. ఇక ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమాపై ట్రైలరే సంచలనం కలిగిస్తుంటే…మరి సినిమా?