కరోనా – కోవిడ్ -19 వైరస్ గురించి రకరకాల పరిశోధనలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ వైరస్ కు వ్యాక్సిన్ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తాము కనుగొన్న వ్యాక్సిన్ లు సానుకూల ఫలితాలను చూపుతున్నాయని వివిధ పరిశోధనా సంస్థలు ప్రకటిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి రాదని అవే స్పష్టం చేస్తున్నాయి. ఇంకా రెండు నెలల పాటు ప్రయోగాలే కొనసాగుతాయని, ఈ లోపే భారీ ఎత్తున ఉత్పత్తి కూడా సాగిస్తున్నట్టుగా ఆ సంస్థలు చెబుతున్నాయి. ప్రయోగాలు విజయవంతం అయితే అక్టోబర్- నవంబర్ నెలల కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, అయితే అందరికీ కాదని అవి షరతులను చెబుతున్నాయి. ముందస్తుగా ఎవరికి వ్యాక్సిన్ అందించాలనేది ప్రభుత్వాలు నిర్ణయిస్తాయన్నట్టుగా వివరిస్తున్నాయి.
ఇండియాకే వంద కోట్లకు మించి డోసులు కావాల్సి ఉంటుంది. ఆ స్థాయిలో ఉత్పత్తి కూడా ఒకే నెలకు కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో విజయవంతం అయినా, ఇండియా వంటి భారీ జనాభా ఉన్న దేశం డిమాండ్ ను అందుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ కు కూడా!
ఆ సంగతలా ఉంటే.. కరోనా దానంతట అది తగ్గిపోయే అవకాశం ఉంటుందా? అనేది మరో ఆశ. అది పూర్తి దైవాధీనం అని చెప్పాలి. మరోవైపు ఇండియాలో కరోనా ప్రభావం గురించి అధ్యయనం చేస్తున్న కొన్ని పరిశోధన సంస్థలు ఆసక్తిదాయకమైన విషయాలను చెబుతున్నాయి. వాటి ప్రకారం.. భారతీయుల్లో కొందరికి నోవెల్ కరోనా వైరస్ ను ఎదుర్కొనే న్యాచురల్ ఇమ్యూనిటీ ఉందట! అంటే కొందరిని కరోనా వైరస్ ఏమీ చేయలేదు అని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. వారికి ఉన్న సహజమైన వ్యాధినిరోధకత ఫలితంగా వారికి కరోనా సోకే అవకాశమే ఉండదట. వారు కోవెల్ -19 వైరస్ కు ఎక్స్ పోజ్ అయినా, వారిని ఆ వైరస్ సోకదట!
అయితే ఇది అందరి విషయంలోనూ కాదని స్పష్టం అవుతోంది. ఢిల్లీలో ర్యాండమ్ టెస్టులు చేసిన ఒక సంస్థ ఒక ఆసక్తిదాయకమైన విషయాన్ని చెబుతోంది. అదేమిటంటే.. మార్చి నెలలో ఇండియాలోకి కరోనా వైరస్ ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క ఢిల్లీలోనే దాదాపు 23 శాతం మంది ఆ వైరస్ ఎక్స్ పోజర్ కు గురయ్యారట! ఢిల్లీ జనాభా దాదాపు రెండు కోట్లు ఉండగా, రమారమీ 40 లక్షల మంది కరోనా వైరస్ ప్రభావం ఏదో విధంగా పడి ఉంటుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. అయితే ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య లక్షా ముప్పై వేల వరకూ ఉంది. కరోనా కు ఎక్స్ పోజ్ అయ్యి కూడా ఆ వైరస్ సోకని వారిలో సహజమైన ఇమ్యూనిటీ ఉందనేది ఆ సంస్థ థియరీ! తాము చేసిన ర్యాండమ్ పరీక్షల్లో చాలా మందిలో కరోనా ను ఎదుర్కొనగల యాంటీ బాడీస్ ఉన్నట్టుగా ఆ అధ్యయన సంస్థ చెబుతోంది. దీన్నే హెర్డ్ ఇమ్యూనిటీ గా అభివర్ణిస్తోంది ఆ సంస్థ.
ఇక టైమ్స్ నౌ లో ప్రచురింతమైన మరో ఆర్టికల్ లో ఇంకా ఆసక్తిదాయకమైన విషయాలను పేర్కొన్నారు. దాని ప్రకారం.. దేశంలో సుమారు 18 కోట్ల మంది కరోనాను ఎదుర్కొనగల ఇమ్యూనిటీ లెవల్స్ ను కలిగి ఉన్నారట! దేశంలోని విభిన్న ప్రాంతాల్లో సుమారు 60,000 మందిపై యాంటీబాడీస్ టెస్టులు చేసి ఈ విషయాన్ని నిర్ధారించిందట మరో అధ్యయన సంస్థ. ఆ పరీక్షల సగటును తీసుకుంటే.. దేశంలో 18 కోట్ల మంది ఆల్రెడీ నోవెల్ కరోనా వైరస్ ను ఎదుర్కొగల ఇమ్యూనిటీనీ కలిగి ఉన్నారని, ఇలాంటి వారికి ఏ వ్యాక్సిన్ అవసరం లేదని, కరోనా వైరస్ వారిని సోకలేదని ఆ పరిశోధకులు తేల్చి చెబుతున్నారు!
గమనించాల్సిన అంశం ఏమిటంటే, కొందరు జనాల్లో కూడా ఈ ఫీలింగ్ ఉంది. తమకు కరోనా ఆల్రెడీ సోకే ఉంటుందని, దానంతట అదే తగ్గుముఖం పట్టి ఉంటుందని నమ్మే వాళ్లు చాలా మంది కనిపిస్తున్నారు. మొత్తానికి ఇండియాలో కరోనా ప్రభావం మొదలైన ఐదో నెలలో కూడా చాలా వరకూ ఆ వైరస్ విషయంలో అస్పష్టతే కొనసాగుతోంది!