పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తున్నాడహో అంటూ ఓ రేంజ్ లో డప్పు కొట్టింది 'ఆహా'. ఆల్ మోస్ట్ ఓ సినిమాకు చేసినంత ప్రచారం చేసింది. పోస్టర్లు, టీజర్లు, బ్యానర్లు.. ఆ హంగామా మామూలుగా లేదు. దీనికితోడు ప్రభాస్ ఇప్పటివరకు ఎక్కడా చెప్పని విషయాలన్నీ చెప్పేశాడనే రేంజ్ లో బిల్డప్ ఇస్తూ వీడియోలు వదిలారు.
దీంతో ప్రభాస్-బాలయ్య చిట్ చాట్ పై చాలా హైప్ జనరేట్ అయింది. ఎంతలా అంటే స్ట్రీమింగ్ కు పెట్టిన మొదటి గంటకే సర్వర్ ఢమాల్. దీనికి తోడు ఈ షోను పైరసీ చేయకుండా ఉండేందుకు కోర్టుకు కూడా వెళ్లింది యాజమాన్యం.
ఇంత హంగామా చేసిన బాలయ్య-ప్రభాస్ చిట్ చాట్ లో ఏముంది? ఆసక్తికర అంశాలేమైనా కనిపించాయా? సమాధానం లేని ప్రశ్నలివి.
బాహుబలి ఎపిసోడ్ లో మొదటి భాగమంటూ స్ట్రీమింగ్ కు పెట్టిన 50 నిమిషాల రన్ టైమ్ లో ఫ్యాన్స్ అరుపులు, ప్రభాస్-బాలయ్య ఎలివేషన్లు, పోసుకోలు కబుర్లు తప్ప 'మేటర్' ఏం లేదు.
ప్రభాస్ వ్యక్తిగత విషయాలనగానే అందర్నీ ఆకర్షించే అంశం అతడి పెళ్లి. 43 ఏళ్ల ప్రభాస్ పెళ్లిపై ఏదో ప్రకటన చేశాడనేలా టీజర్లు కట్ చేశారు. కట్ చేస్తే, ఎపిసోడ్ లో ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసిన అంశంపై బాలయ్య సాగదీశాడు. ప్రభాస్ తో డేటింగ్ రూమర్స్ పై కృతిసనన్ స్పష్టమైన ప్రకటన చేసింది.
ఇలాంటి అంశంపై ప్రభాస్ ను డయాస్ పై నిలబెట్టి, అల్లంత దూరంలో బాలయ్య నిల్చొని, అంతసేపు షోను సాగదీశారంటూ.. నిర్వహకుల దగ్గర కంటెంట్ లేదనే విషయం ఈజీగా అర్థమౌతుంది. లేదంటే, రెండు భాగాలు చేయడం కోసం ఎడిటింగ్ చేయకుండా ఉన్నదున్నట్టు అలా మొదటి భాగంలో పెట్టేసైనా ఉండాలి.
మొత్తమ్మీద బాహుబలి మొదటి ఎపిసోడ్ అంటూ వచ్చిన ప్రభాస్-బాలయ్య ఛాట్ షోలో ఆర్భాటం ఎక్కువ, విషయం తక్కువగా ఉంది. ఉన్నంతలో రామ్ చరణ్ తో ఫోన్ సంభాషణ కాస్త ఆకట్టుకుంది. ప్రభాస్-చరణ్ ఎంత క్లోజ్ అనే విషయం జనాలకు తెలిసొచ్చింది. అయితే కొద్దిసేపటికి అది కూడా సాగదీత అయిపోయింది. దీనికితోడు ప్రారభంలో బాలయ్య చెప్పిన డైలాగ్ ను, చివర్లో మళ్లీ రిపీట్ చేయడం.. నిర్వహకుల భావదారిద్ర్యం.
ఇక ఆశలన్నీ బాహుబలి రెండో ఎపిసోడ్ పైనే ఎందుకంటే ఆఖర్లు గోపీచంద్ వచ్చాడు. ప్రభాస్-గోపీచంద్ కలిసి ఏమైనా కొత్త విషయాలు మాట్లాడితే ఓకే. మళ్లీ ఎలివేషన్లు, అరుపులకే ప్రాధాన్యత ఇస్తే మాత్రం ప్రభాస్ ఇచ్చిన ఓ మంచి అవకాశాన్ని, ప్రభాస్-గోపీచంద్ లు కలిసి కూర్చున్న ఓ మంచి కాంబినేషన్ ను 'ఆహా' మిస్సయినట్టే.