“మీకు పాలసీ ఉందా? అయితే ఆ పాలసీ పైన మీకు లోన్ మంజూరు చేస్తాం. ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వనంత తక్కువ వడ్డీకి అందిస్తాం. ఆ డబ్బును మీరు ఫిక్స్ డ్ డిపాజిట్ లో వేసుకున్నా చాలు. వడ్డీ కట్టేయొచ్చు.”
సైబర్ మోసగాళ్ల నయా ఎత్తుగడ ఇది. ఏ కంపెనీకి చెందిన పాలసీ ఉన్నప్పటికీ వీళ్లకు అనవసరం. నిజానికి అసలు వీళ్లకు పాలసీనే అక్కర్లేదు. ఊరికే ముగ్గులోకి దించడానికి పాలసీ నంబర్లు అడుగుతుంటారు. ఆ తర్వాత వీళ్ల అసలు బండారం బయటపడుతుంది.
ఢిల్లీకి చెందిన ఓ మహిళకు ఇలానే భారీ ఆఫర్ ఇచ్చారు సైబర్ మోసగాళ్లు. దీన్ని నమ్మిన సదరు మహిళ.. ప్రాసెసింగ్ ఫీజు, వివిధ రకాల ఫార్మాలటీస్ కింద 14 లక్షలు చెల్లించింది. అటు 50 లక్షలు వస్తోంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదనుకుంది. కట్ చేస్తే, ఆ 50 రాలేదు, ఇటు ఈ 14 లక్షలు పోయాయి.
తను మోసపోయానని గ్రహించిన బాధిత మహిళ, సైబర్ పోలీసుల్ని ఆశ్రయించింది. అప్పటికే ఇలాంటి కేసులు మరో 4 పోలీసుల దగ్గరకొచ్చాయి. దీంతో పక్కాగా వల పన్నారు ఢిల్లీ పోలీసులు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా మోహిత్ శర్మ (31), ప్రేమ్ సింగ్ (33), మొహమ్మద్ ఫైసల్ (37)ను అరెస్ట్ చేశారు.
వీళ్ల వద్ద నుంచి కారు, ల్యాప్ టాప్, పాస్ పోర్టులు, చెక్ బుక్కులు, క్రెడిట్, డెబిట్ కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఏకంగా 170 మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిని విశ్లేషిస్తే మరిన్ని నేరాలు బయటకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.