నేరాలు చేసి సులభంగా తప్పించుకోవచ్చనుకునే వాళ్లకు ఇదొక పాఠం. హత్య కేసులో నిందితుడ్ని, 28 ఏళ్ల పాటు నిఘాలో ఉంచి, తాజాగా అరెస్ట్ చేశారు పోలీసులు. సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి సీన్, మహారాష్ట్రలో కళ్లముందు ప్రత్యక్షమైంది.
మహారాష్ట్రలోని కషిర్మిరా ప్రాంతంలో 27 ఏళ్ల జాగ్రణీదేవి ప్రజాపతి హత్యకు గురయ్యారు. ఆమెతో పాటు ఆమె నలుగురు పిల్లల్ని కూడా దుండగులు హత్య చేశారు. ముగ్గురు అగంతకులు ఈ పని చేశారని పోలీసులు నిర్థారణకొచ్చారు.
1994లో జరిగింది ఈ ఘటన. అప్పట్నుంచి ఈ కేసుపై ఓ కన్నేసి ఉంచారు పోలీసులు. తాజాగా ఆ ముగ్గుర్లో ఒకడి ఆచూకి దొరికింది. అతడు ఖతార్ లో తలదాచుకున్నాడు. అతడిపై కొన్నేళ్లుగా నిఘా పెట్టారు పోలీసులు.
తాజాగా అతడు ముంబయి ఎయిర్ పోర్ట్ లో దిగాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, ఎయిర్ పోర్ట్ లోనే అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
అలా హత్య జరిగిన 28 ఏళ్ల తర్వాత ప్రధాన నిందితుడ్ని పోలీసులు గుర్తించి, అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయంలో టెక్నాలజీ తమకు ఎంతగానో ఉపయోగపడిందని, దాంతో పాటు ముంబయి ఎయిర్ పోర్ట్ అధికారుల సహకారం కూడా బాగుందని తెలిపారు పోలీసులు.