అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ (క్లుప్తంగా డాన్ అంటారు) ట్రంప్ 2024 ఎన్నికలలో మళ్లీ అధ్యక్షపీఠానికి పోటీ చేస్తాననడంతో కొందరు రిపబ్లికన్ నాయకులకు భయం పట్టుకుంది, ట్రంప్ తన దుందుడుకుతనంతో మళ్లీ పార్టీ ఓటమికి కారకుడవుతాడని! వాళ్లు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. వాళ్ల కంటికి ఫ్లారిడా గవర్నర్ రోనాల్డ్ (క్లుప్తంగా రాన్ అంటారు) డెసాంటిస్ కనబడ్డాడు. రిపబ్లికన్ పార్టీ తరఫున తనకు బదులుగా రాన్‌ను నిలబెడదామని కొందరు ఆలోచిస్తున్నారని తెలియగానే డాన్ మండిపడ్డాడు. తన అనుయాయిగా పదవిని దక్కించుకుని, తన భావాలే అనుసరిస్తూ వచ్చిన రాన్ యిప్పటిదాకా పోటీ చేస్తానని చెప్పకపోయినా డాన్ కారాలు, మిరియాలూ నూరేస్తున్నాడు. ‘పార్టీ తరఫున అతన్ని అధ్యక్షపదవికి నిలబెడితే అతని గురించిన గతమంతా బయటపెట్టేస్తా, అతని గురించి అతని భార్యక్కూడా బహుశా తెలిసుండని సంగతులన్నీ బజార్న పడేస్తా’ అని బెదిరిస్తున్నాడు. ఈ యుద్ధాన్నే డాన్ వెర్సస్ రాన్ అంటున్నారిప్పుడు.
ఈ రాన్ మనకు పరిచితుడు కాడు కాబట్టి అతని గురించి తెలుసుకోవడం ఆసక్తికరం. అంతకుముందు ట్రంప్‌ను కొందరు రిపబ్లికన్లు ఎందుకు వద్దనుకుంటున్నారో కూడా అర్థం చేసుకోవాలి. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన రెండేళ్లకు 2022 నవంబరులో సెనేట్‌కు, హౌస్ ఆఫ్ రిప్రంజటేటివ్స్‌కు, గవర్నర్ల వంటి యితర పదవులకు ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష ఎన్నికలలో నెగ్గిన పార్టీ రెండేళ్ల పాలన పూర్తయిన తర్వాత జరిగే యీ మధ్యంతర ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీకే అధిక స్థానాలు రావడం రివాజు. డెమోక్రాటిక్ అభ్యర్థి అధ్యక్షుడు కాబట్టి యీ ఎన్నికలలో రిపబ్లికన్లు గెలుస్తారని అంచనా వేయడం సహజం.
అయితే అధ్యక్షుడు జో బైడెన్ పాలన పట్ల అమెరికన్లు అసంతృప్తిగా ఉండడంతో రిపబ్లికన్లకు రావలసిన దాని కంటె ఎక్కువ సీట్లు వస్తాయని ఊహించారు. ముఖ్యంగా ప్రజాభిప్రాయ సర్వేలలో బైడెన్‌కు ఆమోదశాతం 40 కంటె తక్కువ ఉండడంతో యీసారి రెడ్ వేవ్ వస్తుందని చాలామంది అభిప్రాయపడ్డారు. రిపబ్లికన్ల రంగు ఎఱుపు కాగా, డెమోక్రాట్లది నీలం. అందువలన రిపబ్లికన్ల గెలుపుని అరుణతరంగం అంటారు. అయితే అలా జరగలేదు. 100 మంది సభ్యులున్న సెనేట్‌లో యిద్దరు స్వతంత్రులుండగా తక్కిన 98 స్థానాలలో డెమోక్రాట్లకు, రిపబ్లికన్లకు చెరి 49 దక్కాయి. అంటే డెమోక్రాట్లకు గతంలో కంటె ఒకటి ఎక్కువ వస్తే, రిపబ్లికన్లకు ఒకటి తగ్గిందన్నమాట.
ఇక 435 మంది సభ్యులున్న ప్రతినిథుల సభకు వస్తే గతంలో డెమోక్రాట్లకు 222 ఉంటే కేవలం 9 తగ్గి 213 అయ్యాయి. రిపబ్లికన్లకు 9 పెరిగి 222 అయ్యాయి. 9 మంది మాత్రమే పెరగడమేమిటి అని అందరికీ ఆశ్చర్యం. రిపబ్లికన్లకు బలం ఉండి, 2020 ఎన్నికలలో ట్రంప్‌కు ఓటేసిన ప్రాంతాలలో కూడా యీసారి రిపబ్లికన్లు ఓడిపోవడం వాళ్లను కంగు తినిపించింది. ప్రస్తుతం దేశం ద్రవ్యోల్బణంతో బాధపడుతోంది. ఆర్థిక సంక్షోభం ఉందంటున్నారు. అలాటి పరిస్థితుల్లో డెమోక్రాటిక్ పార్టీ సెనేట్‌లోనూ, గవర్నర్ల సంఖ్యలోనూ ఆధిక్యత సంపాదించడం ఎలా సాధ్యం? 1934 తర్వాత ఎన్నడూ యిలా జరగలేదు. అధ్యక్షపదవితో పాటు సెనేట్‌లో ఆధిక్యత డెమోక్రాట్లకు 1962 తర్వాత ఎప్పుడూ సిద్ధించలేదు. అదీ ఎలా జరిగింది అని కారణాలు అన్వేషించసాగారు రిపబ్లికన్లు, నిపుణులు.
అమెరికన్ సుప్రీం కోర్టు అబార్షన్ హక్కును రద్దు చేస్తూ తీర్పివ్వడానికి రిపబ్లికన్లు నియమించిన న్యాయమూర్తులే కారణమనే ఆగ్రహం ఆ పార్టీ పట్ల ఆగ్రహాన్ని పెంచిందనేది ఒక కారణం. సర్వేలలో 70% మంది ఓటర్లు ఆ అంశం తమను ప్రభావితం చేసిందని చెప్పారు. వారిలో 60% మంది ఆ తీర్పు పట్ల అసంతృప్తినో, ఆగ్రహాన్నో వెలిబుచ్చారు. పదవులనుభవిస్తున్న అతివాద భావాల రిపబ్లికన్ల పనితీరు పట్ల ప్రజలు నిరాశ చెందారనేది మరో కారణం. 2020 ఎన్నికలలో మోసాలు జరిగాయని ట్రంప్ చేస్తున్న వాదనతో ఏకీభవించినవారిలో చాలామందిని ప్రజలు ఓడించారు. అన్నిటికన్న ముఖ్యంగా ఫలితాలు వచ్చాక ట్రంప్ అనుచరులు 2021 జనవరిలో కాపిటల్ హిల్‌పై దాడి చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం సాధారణ అమెరికన్లు జీర్ణించుకోలేక పోయారు. ఆ సంఘటనపై జరుగుతున్న విచారణ ట్రంప్ పాత్రను వేలెత్తి చూపుతోంది. పదవీవిరమణ చేసిన తర్వాత అధికారిక పత్రాలను ట్రంప్ తరలించుకుని పోవడం అమెరికన్లను విస్మయానికి గురి చేస్తోంది. ట్రంప్ వెనకేసుకుని వచ్చిన అనేకమంది అభ్యర్థులు ఓడిపోయారు.
ఇంత జరిగినా ట్రంప్ యిప్పటికీ తన దుందుడుకు ధోరణి మార్చుకోలేదు. ఇతన్ని అభ్యర్థిగా పెట్టుకుని ముందుకు వెళితే తమకు ఓటమి తథ్యం అని రిపబ్లికన్ అభిమానులు బెంబేలు పడుతున్న సమయంలో వారి దృష్టి ట్రంప్ భావాలే కలిగి ఉండి, ట్రంప్ కంటె సౌమ్యత ప్రదర్శించే ఫ్లోరిడా గవర్నర్, 44 ఏళ్ల రాన్ మీద పడింది. ఇతని కుటుంబం ఇటలీ నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడింది. యేల్ యూనివర్శిటీ, హార్వార్డ్ లా స్కూళ్లలో చదివాడు. లీగల్ ఎడ్వయిజర్‌గా పని చేసి, 2004లో నేవీలో చేరి, 2007లో ఇరాక్‌లో పని చేశాడు. తిరిగి వచ్చాక ఫ్లోరిడాలోని అటార్నీ ఆఫీస్‌లో ఉద్యోగం చేసి 2010లో బయటకు వచ్చాడు. రిపబ్లికన్ పార్టీ తరఫున హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌కు పోటీ చేసి నెగ్గాడు. 2013 నుంచి 2018 వరకు పదవిలో ఉన్నాడు.
2016లో సెనేట్‌కు పోటీ చేద్దామనుకున్నాడు కానీ సిటింగ్ సెనేటర్ కొనసాగుతాననడంతో వెనక్కి తగ్గాడు. 2018 జూన్‌లో గవర్నర్ పోస్టుకి పోటీ చేద్దామనుకుని పార్టీ టిక్కెట్టుకై ప్రయత్నిస్తే తన కంటె సీనియర్ ఏడమ్ పుట్నామ్ ఐన అడ్డు తగిలాడు. పార్టీలో 32% మంది ఏడమ్ వైపుంటే 17% మంది మాత్రమే రాన్‌కు మద్దతిచ్చారు. నిధులిచ్చేవారు కూడా ఏడమ్‌వైపే మొగ్గు చూపారు. రాన్‌కు టిక్కెట్టు రావడం అసంభవం అనుకుంటున్న సమయంలో దేశాధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ నా మద్దతు రాన్‌కే అని ప్రకటించాడు. అంతే, పరిస్థితి మారసాగింది. జులైలో జరిగిన రాన్ ర్యాలీకి ట్రంప్ స్వయంగా హాజరయ్యాడు. ట్రంప్ అనుయాయులందరూ రాన్‌వైపుకి తిరిగిపోయారు. ఏడమ్ కంటె 12% ఎక్కువ లీడ్ వచ్చింది రాన్‌కు. పార్టీ టిక్కెట్టు వచ్చింది. ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థిగా అతి తక్కువ మార్జిన్‌తో గెలిచి గవర్నరయ్యాడు.
ట్రంప్ మద్దతివ్వడం ఆషామాషీగా జరగలేదు. ఇదంతా రాన్ చాలా తెలివిగా ప్లాన్ చేసుకోవడం వలన జరిగింది. 2016 అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలుస్తాడని రాన్ అనుకోలేదు. అందువలన అతను దూరంగానే ఉన్నాడు. ట్రంప్‌ను ఎన్నడూ కలవలేదు కూడా. అయితే ఒకసారి అతను అధ్యక్షుడయ్యాక 2017లో రాన్ ‘ఫ్రీడమ్ కాకస్’ పేర ట్రంప్ విధానాలను సమర్థించే ఒక గ్రూపు ఏర్పాటు చేసి, ట్రంప్‌కు ఆత్మీయుడయ్యాడు. ట్రంప్‌కు అనుకూలమైన ఫాక్స్ న్యూస్‌లో తరచుగా కనబడుతూ ట్రంప్ తలతిక్క విధానాలను వెనకేసుకుని వచ్చేవాడు. 2016 అధ్యక్ష ఎన్నికలలో హిల్లరీ క్లింటన్ ఓడిపోవడానికై రష్యా ప్రయత్నించిందా లేదా అని పరిశోధించడానికి ఏర్పాటు చేసిన రాబర్ట్ మ్యూలర్ విచారణను యితను ఘాటుగా విమర్శించేవాడు. ఆ విచారణ ట్రంప్‌ను వేలెత్తి చూపిస్తుందేమోనని అందరూ సందేహించే వేళ దానికి నిధులు నిలిపివేయాలంటూ 2017 ఆగస్టులో ప్రతిపాదించాడు కూడా. అందుకే యితను గవర్నరు కావడానికి ట్రంప్ సహకరించాడు.
2020 ఎన్నికలలో ట్రంప్ ఓడిపోయాడు. ఈ 2022 మధ్యంతర ఎన్నికలలో ట్రంప్ సమర్థించిన అనేకులు యితర రాష్ట్రాలలో ఓడిపోయారు. కానీ ఫ్లోరిడాలో రాన్ మాత్రం 20% ఆధిక్యంతో మళ్లీ గవర్నరుగా నెగ్గాడు. దాంతో రిపబ్లికన్ పార్టీ సమర్థకులలో రాన్‌పై ఆశలు చిగురించాయి. ట్రంప్ తన సెల్ఫ్‌మేడ్ మ్యాన్‌ని అని చెప్పుకుంటాడు కానీ కాదు, ధనిక కుటుంబంలోనే పుట్టాడు. రాన్ తల్లి నర్సుగా పనిచేసేది. తండ్రి యింటింటికి తిరిగి టీవీ ఎక్విప్‌మెంట్ ఫిక్స్ చేసేవాడు. ఇతను కష్టపడి చదువుకుని, స్కాలర్‌షిప్‌పై యేల్ యూనివర్శిటికీ వెళ్లాడు. హార్వార్డ్ వంటి ప్రతిష్ఠాత్మకమైన కాలేజీలో లా చదివాడు. నేవీలో పని చేసి దేశం కోసం ప్రాణాలర్పించగలనని చూపించుకున్నాడు. యేల్‌లో ఉండగా బేస్‌బాల్ టీముకి కెప్టెన్‌గా ఉన్నాడు.
నిజాయితీగా కష్టపడితే పైకి రావచ్చు అని యువతకు సందేశానిచ్చే యిలాటి కెరియర్ కలిగి ఉండడంతో పాటు ఎంపీ అయ్యాక తీవ్రమైన రైటిస్టు భావాలున్న రిపబ్లికన్ మేధావుల థింక్ ట్యాంక్ ‘క్లబ్ ఫర్ గ్రోత్’ వంటివాటితో సాన్నిహిత్యం పెంచుకుని, ధనికులతో, పార్టీకి విరాళాలిచ్చే దాతలతో స్నేహం చేశాడు. ఆ విధంగా పార్టీలో ముఖ్యులకు ఆప్తుడయ్యాడు. హార్డ్‌కోర్ రిపబ్లికన్లు వెలిబుచ్చే భావాలూ అతనూ వెలిబుచ్చాడు. ఇతర దేశస్తులు వచ్చి అమెరికన్ల ఉద్యోగాలు కొట్టేస్తున్నారని అతనూ ఆరోపిస్తాడు. మెక్సికో నుంచి వలసదారులు వచ్చిపడకుండా గోడ కట్టాలనే ప్రతిపాదనకు సై అన్నాడు. గోడ కట్టడం ఎలాగో మా పిల్లలకు నేర్పుతున్నా అంటూ యాడ్ కూడా యిచ్చాడు. స్వలింగసంపర్కుల హక్కులకు వ్యతిరేకి, ఎబార్షన్‌కు వ్యతిరేకి, గన్ లాబీకి అనుకూలుడు. పన్నులు తగ్గించాలని, ప్రభుత్వ నిబంధనలు సడలించాలని వాదిస్తాడు.
కరోనా వచ్చినపుడు ఫ్లోరిడా గవర్నరుగా అతను లాక్‌డౌన్లు, నిబంధనలు విధించలేదు సరికదా, మాస్కులు ధరించడానికి వీల్లేదన్నాడు. టీకాలు కంపల్సరీ కాదన్నాడు. స్కూళ్లు మూయడానికి వీల్లేదన్నాడు, టీకాలు వేయించుకుని ఉద్యోగులను రానీయమని కంపెనీలు అంటే ఠాఠ్ కుదరదన్నాడు. దాంతో ఫ్లోరిడాలో కరోనా మరణాలు పెరిగాయి, పత్రికలు అతన్ని తూర్పారబట్టాయి, అయినా అతను చెక్కుచెదరలేదు. ‘నేను ప్రజల స్వేచ్ఛను హరించను’ అన్నాడు. కాలిఫోర్నియా కరోనా సంక్షోభసమయంలో అత్యధిక ఆంక్షలు విధించింది. అయినా ఫ్లోరిడాలో కరోనా మరణాల కంటె ఆ రాష్ట్రంలో మరణాలు ఎక్కువ. దాన్ని రాన్ ఎత్తి చూపి ‘చూశారా, అన్ని ఆంక్షలు పెట్టి వాళ్లు సాధించినదేముంది? నేను నా రాష్ట్రాన్ని స్వేచ్ఛకు కేంద్రబిందువుగా నిలిపాను.’ అని చెప్పుకున్నాడు. లిబరల్స్‌ను, జాతివివక్షత గురించి ప్రశ్నించేవాళ్లను తిరస్కరిస్తూ శ్వేతజాతి కార్మికులకు ఆదర్శప్రాయుడిగా నిలిచాడు.
ఒకలా చెప్పాలంటే అతను మరొక ట్రంప్. తేడా ఏమిటంటే ట్రంప్‌వి మొరటు పద్ధతులు. వాచాలత ఎక్కువ. చట్టవిరుద్ధమైన అనేక పనులు చేసి, అనవసరమైన వ్యాఖ్యలు చేసి, వివాదాల్లో యిరుక్కుంటాడు. రాన్ చతురుడు. పాలిష్‌డ్‌గా అనిపిస్తాడు. తటస్థులకు కూడా నచ్చేట్లా మాట్లాడగలడు. ట్రంప్ ఆశపోతుగా కనిపిస్తాడు. ఇతను ఆచరణవాది. ఫ్లోరిడాలో ప్రభుత్వస్కూళ్ల టీచర్ల జీతాలు పెంచాడు. పర్యావరణంపై స్పృహ కనబరచి, వాళ్ల రాష్ట్రంలోని ఎవర్‌గ్లేడ్స్ ఎకోసిస్టమ్ పునరుద్ధరణకై నిధులు కేటాయించాడు. తుపానులు వచ్చినపుడు పునరావాస కార్యక్రమాలు చక్కగా నిర్వహించాడు. అనవసర వ్యయాన్ని తగ్గించి, మిగులు బజెట్ చూపించాడు. అతను ఆచరణవాది కాబట్టి, 2028 వరకు అధ్యక్షపదవికై పోటీ పడకుండా వేచి ఉండగలడు. కానీ అతనా మాట బహిరంగంగా చెప్పటం లేదు. 2024లో అధ్యక్షపదవికి తగిన అభ్యర్థి తనే అని తక్కినవాళ్లు అంటూండగా, ట్రంప్ విధేయుడిగా ‘అబ్బే నేను పోటీ చేయను’ అని ప్రకటించాల్సింది.
కానీ అతనా పని చేయకపోవడంతో ట్రంప్ మండిపడుతున్నాడు. నమ్మకద్రోహి అని పళ్లు నూరుకుంటున్నాడు. అతను చేసిన అనేక దిక్కుమాలిన పనులు తనకు తెలుసని, అతను 2024 అధ్యక్ష పదవికై పోటీ నుంచి తప్పుకోకపోతే అవన్నీ బయటపెడతానని బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. శాంక్టిమోనియస్ అంటే యితరుల కంటె పవిత్రుణ్నని చూపించుకునే ప్రయత్నం. రాన్ డెసాంటిస్ తనను తాను అలా చూపించుకుంటున్నాడని చెప్పడానికి ట్రంప్ అతని పేరుని కాస్త మార్చి ‘డెసాంక్టిమోనియస్’ అనే పదాన్ని కాయిన్ చేశాడు. ట్రంప్ అధికారంలోకి రావడానికి, పాలన సాగించడానికి మీడియా మొఘల్ రూపర్ట్ మర్దోక్ తన ఫాక్స్ న్యూస్ ద్వారా ఎంతో సహకరించాడు. ఇప్పుడతను ట్రంప్‌ను ‘లూజర్’ (నిర్భాగ్యుడు) అంటున్నాడు. రాన్‌యే రిపబ్లికన్ పార్టీకి కొత్త నాయకుడు అని ప్రచారం మొదలుపెట్టాడు. ట్రంప్‌కు యిది ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించవచ్చు కానీ రాన్ ఏ మాత్రం పదవీకాంక్ష ప్రదర్శించినా, ఓర్వలేనితనంతో ట్రంప్ ఎంతవరకు వెళతాడో ఊహించలేము.
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2022)