శివరాత్రి సందర్భంగా కల్కి సినిమా నుంచి ఓ అప్ డేట్ ఇవ్వడానికి ఓ ప్రధానమైన కారణం ఉంది. ఈ సినిమాలో కాశీ ప్రస్తావన ఉంది. తాజాగా విడుదల చేసిన అప్ డేట్ లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.
శివరాత్రి సందర్భంగా కల్కి సినిమా నుంచి ప్రభాస్ పాత్ర పేరును బయటపెట్టారు. ఇన్నాళ్లూ ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు కల్కి అనుకున్నారంతా. కానీ సినిమాలో అతడి పాత్ర పేరు భైరవ. భవిష్యత్తులో కాశీ ఎలా ఉంటుందో ఊహిస్తూ, అక్కడ్నుంచి వచ్చిన వ్యక్తిగా భైరవను పరిచయం చేసింది యూనిట్.
ఈ సినిమాలో సైన్స్-ఫిక్షన్ అంశాలతో పాటు మైథలాజికల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇదివరకే ప్రకటించాడు. సినిమా మహాభారతం టైమ్ లో మొదలై 2898 సంవత్సరం వరకు నడుస్తుందని స్పష్టం చేశాడు.
ఇందులో భాగంగా వందల ఏళ్ల తర్వాత కాశీ ఎలా ఉంటుంది, అక్కడ్నుంచి ఓ వ్యక్తి వస్తే ఎలా ఉంటాడనే అంశాన్ని ఊహిస్తూ ప్రభాస్ లుక్ ను, అతడి పేరును బయటపెట్టారు. పోస్టర్ లో బైరవగా ప్రభాస్ వెరైటీ కళ్లజోడు పెట్టుకొని, జుట్టు ముడివేసుకొని డిఫరెంట్ గా కనిపించాడు. పైకి సాధారణ దుస్తులు ధరించినట్టు ఉన్నప్పటికీ, లోపల అతడికి ఓ కవచం ఉంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఇటలీలో షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్, దిశా పటానీ కాంబినేషన్ లో సాంగ్ షూట్ చేస్తున్నారు. దీపిక పదుకోన్, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా కనిపించనున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న కల్కి సినిమాలో మొదటి భాగాన్ని మే 9న విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.