ఈసారి ఏకంగా సినిమాలోనే బాలయ్య బ్రాండ్ మందు

నిజజీవితంలో బాలయ్య మద్యం సేవిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. తన బ్రాండ్ ఏంటో కూడా ఆయన పలుమార్లు వెల్లడించారు. తను నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన గెస్టులందర్నీ వాళ్ల బ్రాండ్ ఏంటని కూడా అడిగేవారు. అంతెందుకు,…

నిజజీవితంలో బాలయ్య మద్యం సేవిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. తన బ్రాండ్ ఏంటో కూడా ఆయన పలుమార్లు వెల్లడించారు. తను నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన గెస్టులందర్నీ వాళ్ల బ్రాండ్ ఏంటని కూడా అడిగేవారు. అంతెందుకు, బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓటీటీ కార్యక్రమానికి అదే మద్యం కంపెనీ, స్పాన్సర్ గా కూడా వ్యవహరించింది.

ఇప్పుడు తన మద్యం సీసాను వెండితెరపైకి కూడా తీసుకొచ్చారు బాలయ్య. బాబి దర్శకత్వంలో ఈ హీరో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరుపెట్టని ఈ సినిమా నుంచి ఈరోజు గ్లింప్స్ రిలీజ్ చేశారు.

బాలయ్య ఓ పెట్టె పట్టుకొని కారు దిగుతాడు. అక్కడే పెట్టె ఓపెన్ చేస్తాడు. తెరవగానే ఆయుధాలతో పాటు అతడి ఫేవరెట్ బ్రాండ్ మద్యం సీసా కనిపిస్తుంది. ముందుగా మందు కొట్టి, ఆ తర్వాత రౌడీల్ని కొడతాడు. మధ్యలో ఓ డైలాగ్ చెబుతాడు. ఇది బాలయ్య శివరాత్రి కానుక.

బాలయ్య సినిమా అంటే చాలు పూనకం వచ్చినట్టు మ్యూజిక్ ఇచ్చే తమన్, ఈ గ్లింప్స్ కు కూడా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఓపెనింగ్ కు ముందు నుంచే దీన్ని యాక్షన్ సినిమాగా చెబుతున్న మేకర్స్, గ్లింప్స్ లో కూడా అదే విషయాన్ని మరోసారి నొక్కిచెప్పినట్టయింది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. జైలర్ ఫేమ్ విజయ్ కార్తీక్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను వెల్లడిస్తారు.