పాలు, పూలు అమ్ముకొని కోట్లకు పడగలెత్తానని చెప్పుకునే బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి పార్టీ మారడం లేదట. కాంగ్రెస్ పార్టీలోకి పోవడం లేదని క్లారిటీ ఇచ్చాడు. మల్లారెడ్డి, ఆయన అల్లుడు పార్టీ మారుతున్నారని టీవీ చానెళ్లు, పత్రికలు ఊదరగొట్టాయి.
రాజశేఖర రెడ్డికి చెందిన కాలేజీ భవనాలను అధికారులు కూలగొట్టగానే ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కొన్ని భవనాల్ని గురువారం అధికారులు కూల్చివేశారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ పురపాలక పరిధిలోని దుండిగల్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలకి చెందిన శాశ్వత భవనాలను అధికారులు కూల్చివేశారు.
చిన్న దామర చెరువు ప్రాంతంలో కబ్జా చేసి భవనాలను అక్రమంగా నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో కలెక్టర్ ఆదేశాలతో దుండిగల్ గండి మైసమ్మ మండల రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ కు చెందిన మూడు శాఖల అధికారులు రంగంలోకి దిగారు. వీరి ఆధ్వర్యంలో భవనాలను కూల్చడం మొదలుపెట్టారు. అయితే అధికారుల కూల్చివేతలను విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అక్కడికి మర్రి రాజశేఖరరెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో అధికారులు తాత్కాలికంగా కూల్చివేతలను ఆపేశారు. కూల్చివేతలను మళ్లీ మొదలు పెడతామని అధికారులు చెప్పారు. విద్యార్థుల పెద్దఎత్తున చేరుకోవడంతో కాస్త సమయం కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు మరింత పోలీసు ఫోర్స్ ను రప్పించారు.
అన్ని నిబంధనల ప్రకారమే చేస్తున్నామని అధికారులు చెప్పారు. ముందు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారని, ఆ స్థలం ఇరిగేషన్ కు చెందినదని చెప్పారు. ఈ సంఘటన జరగ్గానే మల్లారెడ్డి, ఆయన అల్లుడు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది.
అల్లుడితో కలిసి గురువారం ప్రభుత్వ సలహాదారు, సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను శుక్రవారం కలిశారు. తన కుమారుడు భద్రారెడ్డితో కలిసి కేటీఆర్ నివాసానికి వెళ్లిన మల్లారెడ్డి ఆయనతో మర్యాపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.
బీఆర్ఎస్ నుంచి మల్కాజిగిరి స్థానం నుంచి భద్రారెడ్డి పోటీ చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. మల్లారెడ్డి సైతం తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరారు. గులాబీ బాస్ కేసీఆర్‌కు కూడా అందుకు సమ్మతించినట్లు తెలిసింది. అయితే అనుహ్యంగా భద్రారెడ్డి బరి నుంచి తప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోను అని కేటీఆర్‌తో చెప్పినట్లు తెలిసింది.
ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని కలవడంపైనా కేటీఆర్‌కు మల్లారెడ్డి వివరణ ఇచ్చినట్లు సమాచారం. తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవానాల కూల్చివేతలపైనా కేటీఆర్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. మల్లారెడ్డి అల్లుడితో కలిసి పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న వార్తలపైనా ఆయన స్పందించారు.
తనకు పార్టీలు మారే అవసరం లేదని చెప్పారు. తాను పార్టీ మారబోతున్నట్లు వాస్తున్న వార్తలు అవాస్తవమని కేటీఆర్‌కు క్లియర్‌గా చెప్పినట్లు తెలిసింది. మరి ఆయన బీఆర్ఎస్ లోనే ఉంటాడా? లేదా తాత్కాలికంగా ఆలోచన మార్చుకున్నాడా?