ఎన్నికలు పొత్తులు రాజకీయాలు కాదు కానీ చాలా మంది విడిపోతున్నారు. అలాగే కలుస్తున్నారు. అనకాపల్లిలో చూస్తే మూడున్నర దశాబ్దాలుగా ఇద్దరు రాజకీయ నేతల మధ్య పచ్చ గడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితి ఉండేది. ఆ ఇద్దరే మాజీ మంత్రులు కొణతలా రామకృష్ణ, దాడి వీరభద్రరావు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరూ చెరో పార్టీలో ఉంటూ తన రాజకీయ హవా చూపించేవారు.
తెలుగుదేశం గెలిస్తే దాడిదే అనకాపల్లి రాజకీయం. కాంగెస్ గెలిస్తే కొణతాల చక్రం తిప్పేవారు. ఈ ఇద్దరూ రాజకీయంగా ప్రత్యర్ధులుగా నిలిచి రెండు ఎన్నికల్లోతలపడ్దారు. 2004లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దాడిని కొణతాల కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడించారు. 2009లో కూడా ఈ ఇద్దరూ పోటీ చేశారు. మూడవ పక్షంగా ప్రజారాజ్యం నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేసి ఇద్దరినీ ఓడించారు.
కొణతాల దాడి ఇద్దరూ రాజకీయంగా 2009 నుంచి పెద్దగా వెలుగులు చూడలేదు. ఇద్దరూ టీడీపీ వైసీపీ ఇలా జంప్ చేస్తూనే ఉన్నారు. ఇపుడు కొణతాల జనసేనలో ఉంటే దాడి వైసీపీ నుంచి టీడీపీలోకి తిరిగి చేరారు. టీడీపీ జనసేన పొత్తు బంధం ఇద్దరినీ కలుపుతోంది. పైగా కొణతాల అనకాపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.
దాంతో కొణతాల దాడి ఇంటికి స్వయంగా వచ్చి ఆయన మద్దతు కోరారు. కొణతాల రావడంతో పొంగిపోయిన దాడి తమది తరతరాల కుటుంబ బంధం రాజకీయ పార్టీలుగా వేరు కానీ కుటుంబాలుగా ఒక్కటే అని చెప్పారు. తమది కుటుంబ సమావేశంగా చూడాలి తప్ప రాజకీయంగా కాదు అని మీడియాకు వివరించారు.
కొణతాలను గెలిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కొణతాల కుటుంబంతో తమకు ఎన్నో దశాబ్దాల అనుబంధం ఉందని పాత సంగతులను వల్లి వేశారు అన్నీ వింటూ కొణతాల మౌనంగా చిరునవ్వులు చిందించారు. ఈ ఇద్దరు నాయకులూ ఇప్పుడు ఒక్కటి అయ్యారు అని రెండు పార్టీలలో వినిపిస్తోంది.
ఈ బంధం ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందా నాయకులు కలిసినంతగా అనుచరులు కలుస్తారా అన్నది ఆలోచించాల్సిన అంశం. జగన్ ని దింపాలన్న కసి కోపం ఇద్దరినీ ఒక్కటి చేసింది అని అంటున్నారు. ఇద్దరూ జగన్ బాధితులుగా చెప్పుకుంటున్నారు. అదే అసలైన బంధాన్ని పటిష్టం చేసిందని అంటున్నారు. రాజకీయాల్లో ఒకటి ఒకటి రెండు కావు. ఈ ఇద్దరూ కలిశారు అంటే మైనసులు ఎక్కడా కలవని శక్తులు ఏమిటి అన్నది కూడా చూసుకుంటేనే తప్ప పొత్తులు సక్సెస్ కావు అని అంటున్నారు.