''మా'' ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్న ప్రకాష్ రాజ్, తొలిసారి తన ప్యానెల్ తో కలిసి మీడియా మందుకొచ్చారు. వస్తూవస్తూనే మీడియాను ఓ రౌండేసుకున్నారు. అసోసియేషన్ లో ప్యానెల్స్ మధ్య ఏం జరగడంలేదని, అంతా ఒకటే అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు.
“4-5 రోజుల నుంచి ఛానెల్స్ చూస్తున్నాను. నేను మాట్లాడనవి కూడా కెమెరాలో ఎలా రికార్డ్ అవుతున్నాయో అర్థం కావడం లేదు. మీడియా ఊహాగానాలు చూసి భయమేస్తోంది. కేసీఆర్, కేటీఆర్, ఆంధ్రా సీఏం కూడా ఈ ఎన్నికల్లో కలుగజేసుకుంటున్నారట. మరో 2 రోజులు మీడియా ముందుకు రాకపోతో మోడీ, అమెరికా అధ్యక్షుడు కూడా మా ఎన్నికల్లోకి వచ్చేస్తారని రాసేస్తారేమో.”
ఇలా సున్నితంగా మీడియాకు చురకలంటించారు ప్రకాష్ రాజ్. ఏ ప్యానెల్ కు ఏ సినీ కుటుంబం మద్దతుగా నిలిచిందనే వార్తల్ని ప్రసారం చేయడం ద్వారా మీడియా, ఇండస్ట్రీలో చీలక తెస్తోందని అభిప్రాయపడ్డారు ప్రకాష్ రాజ్. సున్నితమైన అసోసియేషన్ లో చీలిక తీసుకురావొద్దన్నారు.
“సున్నితమైన కళాకారులు ఉన్న అసోసియేషన్ ఎందుకిలా అందరికీ ఎంటర్ టైన్ మెంట్ అయిపోయిందో అర్థం కావడం లేదు. ఇది రాజకీయ పార్టీ కాదు. ఎవరికి ఎవరు నచ్చితే వాళ్లకు ఓటేస్తారు. ఈ ప్యానెల్ ఓ కుటుంబానికి దగ్గరని, మరో ప్యానెల్ మరో ఫ్యామిలీకి దగ్గరని హెడ్ లైన్స్ వేసేస్తున్నారు. దీని వల్ల తెలియకుండానే విభజన వచ్చేస్తోంది. మీడియా చేస్తోంది ఇదంతా.”
ఏమీ జరగడం లేదంటూనే ఇన్ని రోజులుగా తనపై వస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టారు ప్రకాష్ రాజ్. చిరంజీవి, పవన్ కల్యాణ్ ను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. తను నాన్-లోకల్ అయితే తప్పేంటని వాదించారు.
“చిరంజీవి, పవన్ కల్యాణ్ ను మీడియా ఎందుకు లాగుతోంది. అందరి సపోర్ట్ అందరికీ ఉంటుంది. మీడియా ప్రతిది క్రియేట్ చేస్తోంది. నా క్యారెక్టర్ ను ప్రశ్నిస్తారు. ఎవరో ముగ్గుర్ని కూర్చోబెట్టి ఆరోపణలు చేయిస్తారు. ఎవరేం చేసినా నాకేం కాదు. లోకల్, నాన్-లోకల్ అంటున్నారు. సూర్యుడిది ఏ లోకల్? కళాకారులకు లోకల్, నాన్-లోకల్ ఏముంటుంది? అయినా కిందటి సారి ఈ టాపిక్ ఎందుకు రాలేదు. ఇప్పుడే ఎందుకు వస్తోంది.”
అంతా ఒకటేనని, గ్రూపులు లేవని కవర్ చేసే ప్రయత్నం చేసిన ప్రకాష్ రాజ్, చివర్లో నాగబాబుకు మైక్ అందించడం కొసమెరుపు. మైక్ పుచ్చుకున్న నాగబాబు.. తమ సపోర్ట్ తో పాటు చిరంజీవి, పవన్ కల్యాణ్ సపోర్ట్ కూడా ప్రకాష్ రాజ్ కు ఉందని చెప్పడం హైలెట్.