బొబ్బిలి యుద్ధం సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ మూవీ చూస్తే విజయనగరం రాజులు విలన్లుగా కనిపిస్తారు. ఫ్రెంచ్ సేనాధిపతి బుస్సీతో నాటి పూసపాటి రాజు విజయరామ గజపతి చేతులు కలిపి బొబ్బిలి మీద దండెత్తారు అని చరిత్ర చెబుతుంది.
సరిగ్గా ఇపుడు ఆ చరిత్ర పాఠాలను పట్టుకుని వల్లె వేస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. వీరులంటే బొబ్బిలి రాజులే అంటూ ఆయన శ్లాఘిస్తూ పూసపాటి వారసుడు అశోక్ మీద సెటైర్లు వేశారు. తాండ్రపాపారాయుడు, బొబ్బిలి రాజులు పౌరుషానికి ప్రతీకలు అంటూ కీర్తించారు.
ఇక 18వ శతాబ్దంలో జరిగిన బొబ్బిలి యుద్ధంతో వెన్నుపోట్లు ఎన్నో ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. అంతే కాదు, ఫ్రెంచ్, బ్రిటిష్ పాలకులతో నాటి పూసపాటి రాజులు చేతులు కలిపి ప్రజల నుంచి పన్నుల రూపంతో వచ్చిన మొత్తాన్ని తీసుకెళ్ళి కప్పం కట్టేవారని కూడా విజయసాయిరెడ్డి చరిత్ర లోతులను ఒకసారి తడిమారు.
మరి అధునిక కాలంలో పూసపాటి వారసుడు అశోక్ కూడా తన తండ్రి పీవీజీ రాజు, అన్న ఆనందగజపతి మారిదిగా కాకుండా 18వ శతాబ్దం నాటి విజయరామగజపతి వారసుడిగా వ్యవహరిస్తున్నారు అంటూ ఎత్తి పొడిచారు. ఇది పాత కాలం కాదు అశోక్ అంటూ గట్టిగానే కౌంటర్లేశారు.
చిత్రమేంటి అంటే ఇపుడు బొబ్బిలి రాజులు, పూసపాటి రాజులు కూడా టీడీపీలోనే ఉంటున్నారు. మరి బొబ్బిలి యుద్ధం గురించి విజయసాయిరెడ్డి చెబుతూ బొబ్బిలి రాజులకు పూసపాటి వారు వెన్నుపోటు పొడిచారు అని చేసిన ఆరోపణలు వారు ఎలా తీసుకుంటారో చూడాలి.