లోకేష్ పోరాట ఫలితంగానే ఏపీలో టెన్త్ ఇంటర్ పరీక్షలు రద్దు అయ్యాయా. అది నిజమేనా. ఇంతకీ లోకేష్ చేసిన పోరాటం ఏంటి. ఇవేమీ తెలుగుదేశం పార్టీ వారిని అడగకూడదేమో. అడిగినా జవాబు ఉండదు కూడా.
లోకేష్ జూమ్ యాప్ ద్వారా పోరాటం చేశారు. లేఖల ద్వారా చేశారు. మరి ఇదే మహోద్యమమని తెలుగుదేశం భావిస్తే వారి ఆనందాన్ని ఎవరు కాదంటారు. ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు జూలై 31లోగా పరీక్షల మొత్తం షెడ్యూల్ ని ముగించమని గడువు విధించడంతో అది సాధ్యం కాక పరీక్షలు రద్దు చేశామని మంత్రి సురేష్ ఉన్న విషయం మీడియాకే చెప్పారు.
దీని మీద సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి కూడా అందరికీ తెలుసు. కానీ లోకేష్ వల్లనే పరీక్షలు రద్దు అంటూ టీడీపీ బాకా ఊదుతోంది. పోనీ ఆ పార్టీ కార్యకర్తలు కొందరు సంబరపడ్డారు అనుకుంటే కాదు, ఏకంగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు రంగంలోకి దిగిపోయారు.
అంతా మా చినబాబు వల్లనే అంటూ తెగ మెచ్చేసుకున్నారు. లోకేష్ రెండు నెలలుగా పోరాడుతున్నాడని, ఆయన ఉద్యమం ఫలించి ఈ రోజు విద్యార్ధులకు న్యాయం జరిగింది అంటున్నారు.
అంతే కాదు యువత అంతా టీడీపీ వెంటే అన్నట్లుగా కూడా అచ్చెన్న మాట్లాడారు. వారుతో పెట్టుకుంటే ఇంతేనని, వారిదే విజయమని కూడా వ్యాఖ్యానించారు. మొత్తానికి లోకేష్ తో తిరుపతి వీడియో ఎపిసోడ్ తో ఎడం వచ్చింది. ఇపుడు పొగడడం ద్వారా అచ్చెన్న పరీక్ష పాస్ అవుతాడా లేదా అన్నది చూడాలి మరి.