ప్రేక్షకుల పల్స్ తెలుస్తుందా? ‘భగవంత్ కేసరి’ ?

జనం చూసేదాన్ని చేయడానికే మన సినిమా జనం అలవాటు పడ్డారు. ఎక్కడో ఒకసారి ఎవరో ధైర్యం చేస్తారు. ట్రెండ్ మారుతుంది. కానీ ఎక్కువ మందికి ఆల్రెడీ ప్రూవ్ అయిన దారిలో వెళ్లడమే అలవాటు అయిపోయింది.…

జనం చూసేదాన్ని చేయడానికే మన సినిమా జనం అలవాటు పడ్డారు. ఎక్కడో ఒకసారి ఎవరో ధైర్యం చేస్తారు. ట్రెండ్ మారుతుంది. కానీ ఎక్కువ మందికి ఆల్రెడీ ప్రూవ్ అయిన దారిలో వెళ్లడమే అలవాటు అయిపోయింది. ఇటీవల వచ్చిన కొన్ని డబ్బింగ్ సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. సీనియర్ హీరోలు కమల్, రజనీ లాంటి వాళ్లు చేసిన ఆ సినిమాలు చూసాక, మన సీనియర్ హీరోలు ఎందుకు ఇలాంటివి ప్రయత్నించరు అనే ప్రశ్న వినిపించడం ప్రారంభమైంది.

అంతకు ముందు మెగాస్టార్ నటించిన భోళాశంకర్ డిజాస్టర్ అయింది. అదే మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య సూపర్ హిట్ అయింది. అక్కడో సందేహం.. ఏ జానర్ సినిమాలు సీనియర్ హీరోలు చేయాలి అన్నది. ఇలాంటి నేపథ్యంలో కమల్, రజనీ సినిమాలు రావడానికి ముందే స్టార్ట్ చేసారు అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమా. బాలకృష్ణ హీరో. 

నిజానికి బాలకృష్ణ సినిమాలు ఎలా తీసినా, ఓ యంగ్ క్యారెక్టర్ మస్ట్ గా వుంటుంది. ఆ పాత్రకు ఓ హీరోయిన్. గెంతులు, పాటలు మామూలే. కానీ అలాంటివి ఏవీ లేకుండా సీరియస్ గా ఓ తండ్రి లాంటి పాత్రను బాలయ్య పోషించడం, సినిమా అంతా దాదాపు ఒకటే గెటప్ లో కనిపించడం అన్నది కాస్త సాహసమే.

అలాంటి ఫీట్ ను దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో బాలయ్య కలిసి చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య అవుట్ అండ్ అవుట్ ఎమోషన్ ప్లస్ ఫెరోషియస్ రోల్ లో కనిపిస్తారు. డ్యూయట్ అంటూ వుండదు. రొమాన్స్ లాంటి వ్యవహారాలు వుండవు. కానీ బాలయ్య ఫ్యాన్స్ కోరుకనే ఫైట్లు, ఇంటెన్సివ్ కథ వుంటుంది.

ఇప్పుడు ఈ సినిమాను జనాలు యాక్సెప్ట్ చేస్తే మన సీనియర్ హీరోల కోసం దర్శకులు కొత్త కథలు అల్లుతారు. మన సీనియర్ హీరోలకు కూడా ఓ మార్గం కనిపిస్తుంది.