కల్ట్ మూవీకి ఏమైంది.. ఆ ప్రకటన వెనక అర్థం ఏంటి?

చిరంజీవి కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ చరిత్రలోనే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాది ప్రత్యేక స్థానం. అప్పట్లో ఆ సినిమా సృష్టించిన రికార్డులు కోకొల్లలు. అప్పటికే థియేటర్ కు దూరమైన ప్రేక్షకుల్ని సైతం…

చిరంజీవి కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ చరిత్రలోనే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాది ప్రత్యేక స్థానం. అప్పట్లో ఆ సినిమా సృష్టించిన రికార్డులు కోకొల్లలు. అప్పటికే థియేటర్ కు దూరమైన ప్రేక్షకుల్ని సైతం రప్పించిన ఘనమైన సినిమా అది. కె.రాఘవేంద్రరావు డైరక్ట్ చేసిన ఆ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించారు.

చిరంజీవి-శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటించిన ఆ సోషియో ఫాంటసీ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం, సదరు నిర్మాణ సంస్థ ఉన్నఫలంగా సినిమాకు సంబంధించి లీగల్ పబ్లిక్ నోటీసు ఇష్యూ చేయడమే. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు సంబంధించిన సర్వహక్కులు (ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్) వైజయంతీ మూవీస్ బ్యానర్ సొంతమని, ఆ సినిమా ఆధారంగా రీమేక్, సీక్వెల్, ప్రీక్వెల్, వెబ్ సిరీస్ లాంటివి తీయడం చట్టరీత్యా నేరం అంటూ పబ్లిక్ నోటీసు ఇచ్చింది.

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు దగ్గరగా ఎవరైనా, ఏ మాధ్యమంలోనైనా ఓటీటీ కోసం లేదా థియేటర్ కోసం ఫిలిం తీస్తే, లీగల్ చర్యలు తీసుకుంటామని నిర్మాత స్పష్టం చేశారు. ఈ మేరకు పలు పత్రికల్లో లీగల్ గా పబ్లిక్ నోటీసు జారీ చేశారు..

ఉన్నఫలంగా ఏంటిది..

తమ సినిమా హక్కులు తమ దగ్గరే ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పుకోవడంతో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఉన్నఫలంగా 'వైజయంతీ' ఎందుకు ఈ ప్రకటన చేసిందనే చర్చ మొదలైంది. దీనిపై 2-3 రకాల వాదనలు వినిపిస్తున్నాయి.

వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. అది ఫాంటసీ సినిమానే. పంచభూతాలు కాన్సెప్ట్ తో ఓ కథ రాసుకున్నాడు వశిష్ఠ. ఈమధ్య ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ.. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో తన సినిమాను పోల్చాడు. బహుశా.. అశ్వనీదత్ నోటీసు జారీచేయడానికి ఇదొక కారణం అయి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు.

రామ్ చరణ్ తో రీమేక్..

మరికొందరి వాదన మాత్రం మరోలా ఉంది. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను కుదిరితే రామ్ చరణ్ తో రీమేక్ చేస్తానని, ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు అశ్వనీదత్. ఆ దిశగా ఆయనకు చరణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చి ఉంటుందని, అందుకే ముందు జాగ్రత్తగా ఇలా పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేసినట్టున్నారంటూ మరికొంతమంది చెప్పుకుంటున్నారు.

ఈ రెండు వాదనలూ సహేతుకంగానే ఉన్నాయి. అయితే మూడోది కూడా వినిపిస్తోంది. ఓటీటీ కోసం ఓ పీరియాడిక్ బేస్డ్ ఫాంటసీ మూవీ రెడీ అవుతోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టును, టాలీవుడ్ కు చెందిన ఓ టాలెంటెడ్ దర్శకుడు హ్యాండిల్ చేసే అవకాశం ఉంది. ఆ వెబ్ సిరీస్ కూడా దాదాపు జగదేక వీరుడు అతిలోక సుందరి లైన్స్ లోనే ఉంటుందని తెలుస్తోంది.

ఇలా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అశ్వనీదత్ ముందుజాగ్రత్తగా పబ్లిక్ నోటీసులు జారీచేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ సినిమాను రామ్ చరణ్ రీమేక్ చేస్తే చూడాలని చాలామంది మెగాభిమానులకు ఉంది.