ప్రియమణి…ఒకప్పుడు స్టార్ హీరోయిన్. కేరళలో జన్మించిన ఈ బ్యూటీకి సినిమాలంటే ఇష్టం. టాలీవుడ్లో 2003లో 'ఎవరే అతగాడు?' సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ సినిమా ఆమెకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ తర్వాత 'పెళ్ళైనకొత్తలో' సినిమాలో హీరో జగపతి బాబు సరసన నటించి మెప్పించింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఒకేసారి తెలుగులో మూడు సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకొంది. 'యమదొంగ'లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి టాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొంది.
తెలుగులో శంభో శివ శంభో, గోలీమార్, రగడ, రక్తచరిత్ర.. తదితర చిత్రాల్లో నటించారామె. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో కూడా నటించిన ప్రియమణి అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ నటిగా ఓ వెలుగు వెలిగారు. పరుత్తివీరన్ లోని నటనకు 2006 లో జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా దక్కించుకున్నారు.
ప్రియమణి ప్రస్తుతం పలు షోస్‌కి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ కొన్ని సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. తాజా ఇంట ర్వ్యూలో ప్రియమణి ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చారు. కొన్నేళ్ల క్రితం ముస్తఫా రాజ్‌ను ప్రియమణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంటర్వ్యూలో తన భర్త ప్రస్తావన తెచ్చారామె.
ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్తకి తన దగ్గరే ఉద్యోగం ఇచ్చినట్టు చెప్పి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు. తన మేనేజర్‌గా భర్తనే నియమించుకోడాన్ని ఉద్యోగంగా ఆమె సరదాగా చెప్పుకొచ్చారు. తన కాల్షీట్స్, ఇతర అంశాలను ఆయనే చూసుకుంటారని తెలిపారు. తన కోసం ముస్తఫా చాలా కష్టపడతాడంటూ ప్రియమణి తన శ్రీవారిని పొగడ్తలతో ముంచెత్తారు.