యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ హీరోగా నటించిన ‘శేఖర్’ సినిమా నిలిపివేతపై నిర్మాత సుధాకర్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘శేఖర్’ సినిమాని నిలిపివేయాలని న్యాయస్థానం ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. ఇటీవల ‘శేఖర్’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన మూడో రోజే సినిమా నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించినట్టు వార్తలొచ్చాయి.
తనకు ఇవ్వాల్సిన డబ్బులు జీవిత, రాజశేఖర్ ఇవ్వలేదని ఫైనాన్షియర్ పరంధామ కోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలిసినవే. ఈ నేపథ్యంలో ఇవాళ నిర్మాత సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు శేఖర్ ప్రదర్శనను ఆపివేయాలని ఎప్పుడు చెప్పలేదన్నారు.
శేఖర్ సినిమాకు అన్యాయం చేశారన్నారు. లీగల్ డాక్యుమెంట్లన్ని తన వద్దే ఉన్నాయన్నారు. ఈ చిత్రానికి శివాని, శివాత్మికలు నిర్మాతలు కారన్నారు. కేవలం వారి పేర్లు మాత్రమే ఉంటాయన్నారు. సినిమాను నిలిపివేయాలని కోర్టు ఎక్కడా చెప్పలేదని, డిజిటల్ ప్రొవైడర్స్ ఆపేయడం వల్లే ఆగిపోయిందని ఆయన వాపోయారు. శేఖర్ సినిమాను డిజిటల్ ప్రొవైడర్లు చంపేశారని దుయ్యబట్టారు.
ఫైనాన్షియర్ పరంధామ రెడ్డిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తనకు కలిగిన నష్టాన్ని పరంధామయ్య ఇస్తాడా? డిజిటల్ ప్రొవైడర్లు ఇస్తారా? అని నిర్మాత నిలదీశారు. తాను దుబాయ్‌లో ఉంటున్నట్టు నిర్మాత తెలిపారు.
ఒకే ఇంట్లో డైరెక్టర్ జీవిత, హీరో, మరో ఇద్దరు నటులు ఉన్నారన్నారు. వారు తన కోసం పని చేశారన్నారు. జీవిత రాజశేఖర్ వల్ల తనకు ఎలాంటి నష్టం కలగలేదన్నారాయన.