తాను అధికారంలోకి వస్తే కేవలం వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తానని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. తీరా అమలు విషయానికి వచ్చే సరికి, వాస్తవం బోధపడి పిల్లిమొగ్గలు వేయడం ఉద్యోగుల ఆగ్రహానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో సీపీఎస్‌పై మరోసారి ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించడం ఆసక్తి రేపుతోంది.
ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరోవైపు సచివాలయం ఎదుట సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
ఒకవైపు మంత్రులతో ఉద్యోగ సంఘాల నేతలు చర్చిస్తుండగా, మరోవైపు ఉద్యోగులు నిరసనకు దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేయాలని, జీపీఎస్‌ను అంగీకరించొద్దని కోరుతూ ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులకు గులాబీ పూలు అందజేసి నిరసన తెలిపారు. సీపీఎస్, జీపీఎస్ వద్దు, ఓల్ట్ పెన్షన్ స్కీం ముద్దంటూ ప్లకార్డులు, గులాబీపూలతో వినూత్న రీతిలో నిరసన, ఆవేదనను ఉద్యోగులు ప్రదర్శించారు.
ఉద్యోగులు మాట్లాడుతూ గతంలో పీఆర్సీ సాధన సమితి సమావేశంలో జరిగిన చర్చల్లో ఓపీఎస్‌ను తీసుకొస్తామని ఉద్యోగ సంఘం నాయకులు చెప్పారని గుర్తు చేశారు. ఒకవేళ ఓపీఎస్‌కు బదులు జీపీఎస్ గురించి మాట్లాడితే సమావేశాన్ని బాయ్ కాట్ చేయాలని ఉద్యోగ సంఘాల నేతలకు సూచించడం గమనార్హం.