మార్కెటింగ్ టెక్నిక్ లు వాడడంలో, పబ్లిసిటీ జిమ్మిక్కులు చేయడం లో దర్శకుడు రాజమౌళిని మించిన వారు లేరు. సినిమా ప్రచారం మొత్తాన్ని ఆయనే ప్లాన్ చేస్తారు. తెలుగు మీడియా అన్నది జస్ట్ ఫార్మాలిటీ ఆయనకు. కేవలం బాలీవుడ్ మీడియానే నమ్ముకుంటారు. వారికే ప్రీమియర్లు వేస్తారు. సినిమా ఇంకా థియేటర్లో పడకుండానే బాజాలు వాయించే కార్యక్రమం మొదలెట్టేస్తారు. బాహబలి సిరీస్ టైమ్ లోనూ ఇదే తీరు. ఆర్ఆర్ఆర్ టైమ్ లోనూ ఇదే వ్యవహారం.
కలెక్షన్ల కార్డులు హైదరాబాద్ తయారైపోయి ముంబాయిలో ట్వీట్ లుగా మారతాయి. అఫీషియల్ అని ఎవ్వరూ చెప్పరు. రోజు రోజుకూ అంకెలు పెంచుకుంటూ పోతుంటారు. ఖండించేవారు వుండరు. కరెక్ట్ కాదనేవారు వుండరు. దిల్ రాజు లాంటి డిస్ట్రిబ్యూటర్ నైజాంలో 87 కోట్లు మాత్రమే చేసింది అని చెప్పినా 100 కోట్లు దాటేసిందని టముకు వేస్తారు.
మొత్తం మీద సినిమాను 1000 కోట్లు దాటించేస్తారు. నిర్మాత డివివి దానయ్య ఈ ఫిగర్ ను అధికారికంగా ప్రకటిస్తారా? ఆదాయపన్ను శాఖకు, జిఎస్టీ శాఖకు ఇచ్చే లెక్కలు ఓపెన్ గా చెప్పగలరా? అవన్నీ ఎలాగూ వుండవు. అందుకే అంకెలు వేసుకంటూ వెళ్లిపోతారు.
ఇక ప్రచారం చూడాలి. ఆర్ఆర్ఆర్ బ్రాండింగ్ తో రకరకాల షర్ట్ లు, చార్టర్ ఫ్లయిట్ లో పర్యటనలు, ఆ ఫొటోలు. పెద్ద పెద్ద డైరక్టర్లు సెలబ్రిటీలతో ఇంటర్వూలు, స్వ డబ్బా..పరడబ్బా..పరస్పర డబ్బా అన్నట్లుగా ఇవి సాగుతాయి. ఇలా నానా జిమ్మిక్కులు ఆర్ఆర్ఆర్ స్వంతం. అదే మీడియాలకు ఇంటర్వూలు ఇస్తే ఏ ప్రశ్నలు అడిగి ఇరుకున పెడతారో అని అనుమానం. బాలీవుడ్ లో అయితే ఇలాంటి సమస్యలు వుండవు.
ఇక కేజీఎఫ్ సంగతి చూద్దాం.
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం కేజీఎఫ్ సినిమా పబ్లిసిటీకి చాలా అంటే చాలా తక్కువగా ఖర్చు చేసారు. ఆ సినిమా బడ్జెట్ తో పోల్చుకుంటే ఈ పబ్లిసిటీ ఖర్చు చాలా అంటే చాలా నెగ్లిజబుల్. పైగా బ్రాండింగ్ షర్ట్ లు లేవు. సెలబ్రిటీలతో మొహమాటపు ఇంటర్వూలు లేవు. మీరు ఇంత గొప్ప, అంత గొప్ప అనే భుజం చరిచే కార్యక్రమాలు లేవు.
నువ్వు ఎంత కష్టపడ్డావో అని హీరోను డైరక్టర్, మీరెంత కష్టపడ్డారో అని డైరక్టర్ ను హీరో పరస్పరం చేసుకునే భజన కార్యక్రమాలు లేవు. తిరుపతి, సింహాచలం దైవ దర్శనం, తెలుగునాట సింపుల్ గా రెండు మూడు ప్రెస్ మీట్ లు, పోనీ కన్నడ నాట ఏమైనా హడావుడి చేసారా అంటే అదీ లేదు.
జస్ట్ జనాలకు ఆ సినిమా మీద వున్న క్రేజ్ అంతే. అది ఆర్టిఫిషియల్ గా మౌంట్ చేసినది కాదు. దానికదే వచ్చినది.