తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. మీడియా ముఖంగా రాజకీయాలు మాట్లాడి ఎంతకాలం అయింది. మీలో ఎవ్వరికైనా గుర్తుందా? ఆ మాటకొస్తే.. తాను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనే సంగతి, కనీసం గంటా శ్రీనివాసరావుకు అయినా గుర్తున్నదా? లేదా? ఉండే ఉండొచ్చు.. లేకపోతే ఆ పదవికి ఆయన రాజీనామా చేసేవారే కాదు.
ఈ మూడేళ్లలో రాజీనామా లేఖ విషయంలో తప్ప.. ఆయన ఎన్నడూ తెలుగుదేశం ఎమ్మెల్యే మాదిరిగా వ్యవహరించినదే లేదు. అలాంటి గంటా శ్రీనివాసరావు తాజాగా గళం విప్పారు. అధికార పార్టీ మీద ధ్వజమెత్తారు. అందుకే, మూగపోయిన గంట మళ్లీ ఎందుకు మోగుతోందో అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
తెలుగుదేశం ఎమ్మెల్యే అయినప్పటికీ.. గంటా శ్రీనివాసరావు.. ఇన్నాళ్లూ ఆ పార్టీతో సంబంధం లేనట్లుగానే వ్యవహరించారు. నిజానికి 2019 ఎన్నికల తర్వాత.. తెలుగుదేశం పార్టీకి ఇక భవిష్యత్తు లేదనే సంగతిని ముందుగా గుర్తించినది గంటా శ్రీనివాసరావే. అనధికారికంగా ఆయన పార్టీతో సంబంధాలను తెంచేసుకున్నారు.
పార్టీని పట్టించుకోవడం కూడా మానేశారు. ఎంత సీరియస్ గా పార్టీకి దూరం ఉండిపోయారంటే.. చంద్రబాబునాయుడు పార్టీ సమావేశాలకు పిలిచినా వెళ్లలేదు. వ్యక్తిగతంగా కలవడానికి పిలిచినా వెళ్లలేదు. చంద్రబాబు విశాఖ పర్యటనలకు వచ్చినా వెళ్లలేదు. అన్ని రకాలుగానూ.. తనకు తెలుగుదేశానికి సంబంధం లేదని ప్రజలు గుర్తించాలని తపన పడ్డారు.
ఈలోగా విశాఖ ఉక్కు ఉద్యమం కలిసొచ్చింది. తన పదవికి స్పీకరు ఫార్మాట్ లో రాజీనామా చేశారు. అదింకా ఆమోదం పొందలేదు. ఈలోగా ఆయన ఏపీలోని కాపు ప్రముఖులతో విందు సమావేశాలు నిర్వహించ సాగారు. బీజేపీలో చేరడానికి, వైసీపీలో చేరడానికి కూడా తెరవెనుక ప్రయత్నాలు సాగించారనే పుకార్లున్నాయి. కాపులతో ప్రత్యేకంగా పార్టీ పెట్టే యోచన చేశారని కూడా గుప్పుమంది. ఈ పుకార్లలో నిజానిజాలు తెలియవు గానీ.. టీడీపీకి దూరమైన మాట వాస్తవం.
అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. జగన్ ప్రభుత్వం మీద విమర్శలు కురిపించారు. ఆ విమర్శలేవీ కొత్తవి కాదు. రొటీన్ పాచిపోయిన విమర్శలే. అందుకే వాటి ప్రస్తావన అనవసరం గానీ.. అసలు ఇన్నాళ్లూ దూరం ఉండిపోయిన నాయకుడు.. హఠాత్తుగా ఎందుకు మళ్లీ టీడీపీ రంగు పూసుకుని జనం ముందుకొచ్చాడా? అనేది డౌటు. బీజేపీ వైసీపీ చేరికలు మంటగలిసినట్టే.. ఆయన తలపెట్టిన కాపు పార్టీకి కూడా పురిట్లోనే సంధికొట్టిందా అని పలువురు అంచనా వేస్తున్నారు.