ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాల కమ్మ రాజమాత, మాజీ ఎంపీ రేణుకాచౌదరి సవాల్ విసిరారు. ప్రతి మాటలో అహంకారం తొణికసలాడింది. రేణుకాచౌదరి హావభావాలు కమ్మేతర సామాజిక వర్గాలను రెచ్చగొట్టేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం తెలంగాణ కమ్మ సేవా సమితి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి రేణుకాచౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సభలో ఆమె ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కమ్మ సేవా సమితి ఆత్మీయ సమ్మేళనంలో రేణుకాచౌదరి ఏమన్నారో ఆమె మాటల్లోనే…
“కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దమ్ముంటే అమరావతికి కమ్మరావతి అని పేరు పెట్టరా (జగన్‌కు పరుష పదజాలంతో సవాల్). మంచితనాన్ని బలహీనత అనుకోవద్దు. కమ్మ సామాజిక వర్గం ఓర్పును తక్కువ అంచనా వేయొద్దు. ఒక రంగు పూసి, ఒక పేరు పెట్టి వెనక్కి తోయాలనుకుంటే భయపడతామా? అది ఎప్పటికీ జరగదు. ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తూ బంగారం లాంటి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. మనమంతా సరంజామా సర్దుకుని మరో రాష్ట్రానికి వెళ్లిపోవాలంటే వెళ్లిపోయేది లేదు” అని రేణుకాచౌదరి తన మార్క్ ప్రసంగంతో తన సామాజిక వర్గాన్ని ఆకట్టుకున్నారు.
ఇదే సందర్భంలో మిగిలిన సామాజిక వర్గాలను రెచ్చగొట్టేలా, లెక్కలేనితనంతో మాట్లాడారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మీయ సమ్మేళనంలో తన సామాజిక వర్గానికి చెందిన సేవల గురించి ప్రస్తావించి వుంటే బాగుండేదని, అందుకు విరుద్ధంగా రాజకీయ విమర్శలకు, కుల విద్వేషాలను రెచ్చగొట్టడం వెనుక ఉద్దేశం ఏంటో రేణుకా చౌదరికే తెలియాలని అంటున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్‌లో కొనసాగుతున్న రేణుకాచౌదరి, ఆ పార్టీ బలోపేతం కోసం పని చేయడం మానేశారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. రాజకీయంగా ఇక చేసేదేమీ లేక, కమ్మ కుల ఉద్ధారక పాత్ర పోషించడానికి సరికొత్త అవతారంలో రేణుకాచౌదరి తెరపైకి వచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి.