జనసేనాని పవన్‌కల్యాణ్, రచయిత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి వివాదంలోకి నటి పూనమ్‌కౌర్ ప్రవేశించారు. తెలుగు సమాజానికి తన మనసులో గూడు కట్టుకున్న భావాల్ని చెప్పాలనే తపన ఆమెలో బలంగా ఉంది. ఈ విషయాన్ని ఆమె తాజా ట్వీట్స్ ప్రతిబింబిస్తున్నాయి. సినీ పరిశ్రమలో రాణించాలని ఎన్నో ఆశలతో టాలీవుడ్‌కి వచ్చిన పంజాబ్ యువతిని పరిశ్రమలోని ఓ పెద్ద వ్యక్తి నాశనం చేశారని పోసాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
సినీ ఫంక్షన్‌లో జగన్ ప్రభుత్వంపై పవన్‌కల్యాణ్ విమర్శలు కాస్తా… సెలబ్రిటీల బతుకులను బజారుకీడ్చాయి. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి మీడియాతో రెండు దఫాలుగా మాట్లాడి పవన్‌కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి తీవ్ర విమర్శలు చేసి గరిష్టంగా నష్టం కలిగించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో నటి పూనమ్‌కౌర్ ట్విటర్ వేదికగా తనవైన అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం చర్చకు దారి తీసింది. పవన్, పోసాని మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో ఆమె వరుస ట్వీట్లు ఆసక్తికరంగా ఉన్నాయి.
చిత్ర పరిశ్రమలో ఏకైక గురువు దాసరిగారు అని, ఆయన్ను మిస్ అయ్యానని ఆమె ఆవేదనతో ఒక పోస్టు ట్వీట్ చేశారు. అలాగే మరో ట్వీట్‌లో రౌడీ దర్బార్ చిత్రంలోని ఇంద్రలోకం పార్టీ … చంద్రలోకం పార్టీ … మీ జెండాలకు వేల వేల దండాలయా…మీ పార్టీల్లో గూండాలను చేర్చకండయా అనే పాట వీడియోను పోస్ట్ చేసి దయచేసి ఈ పాటను వినాలని, ఎంజాయ్ చేయాలని ఆమె కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పూనమ్ లెక్క ప్రకారం రౌడీలెవరు? అనే చర్చకు తెరలేచింది. జనసేనాని పవన్‌కల్యాణ్ కూడా ఒక రాజకీయ పార్టీని నడుపుతుండడంతో పూనమ్ హితవు ఎవరికి వర్తిస్తుందనేది ఓ ప్రశ్నగా మిగిలింది. గతంలో పవన్, కత్తి మహేశ్ మధ్య వివాదం నడుస్తున్నప్పుడు కూడా పూనమ్ ఇలాగే ట్వీట్స్ చేయడం, ఆ తర్వాత తొలగించడం చర్చకు దారి తీసింది.
ఏదో చెప్పాలనే తాపత్రయం ఆమె మనసులో ఉన్నట్టు తాజా ట్వీట్స్ తెలియజేస్తున్నాయి. అయితే చెప్పడానికి ఆమె ధైర్యం చేయలేకపోతున్నారనేది వాస్తవం.