బిగ్ బాస్ హౌజ్ లో ఓ మంచి లవ్ స్టోరీ ముగిసింది. ఇన్నాళ్లూ రాహుల్-పునర్నవి సాగించిన ముద్దుముచ్చట్లు, ప్రేమఆటలు ఇక కనిపించవు. అవును.. బిగ్ బాస్ హౌజ్ నుంచి పునర్నవి ఎలిమినేట్ అయింది. ఓ ప్రేమ జంటను బిగ్ బాస్ విడదీశాడు. పునర్నవి హౌజ్ ను వీడి వెళ్లిపోతుంటే.. రాహుల్ ఒకటే ఏడుపు. ఎంతలా ఏడ్చాడంటే ఒకదశలో అతడు షోలో కూడా పాల్గొనలేకపోయాడు. వెక్కివెక్కి ఏడ్చాడు.
ఎప్పట్లానే బిగ్ బాస్ సీజన్-3పై వస్తున్న లీకులు ఈసారి కూడా నిజమయ్యాయి. పునర్నవిని ఎలిమినేట్ చేస్తున్నారనే విషయం నిన్న పొద్దున్నుంచే సోషల్ మీడియాలో లీక్ అయింది. సాయంత్రానికి అదే నిజమైంది. సీజన్ 11వ వారం పునర్నవి హౌజ్ నుంచి బయటకొచ్చింది. ఈ వారం రాహుల్, వరుణ్, పునర్నవి, మహేష్ ఎలిమినేట్ కాగా.. వీళ్ల నుంచి మహేష్ విట్టాను ఆల్రెడీ సేవ్ చేశాడు బిగ్ బాస్.
ఇక మిగిలిన ముగ్గుర్నుంచి వరుణ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే అతడు బలమైన అభ్యర్థిగా కొనసాగుతున్నాడు. సో.. బయటకు వెళ్తే రాహుల్ వెళ్లాలి లేదంటే పునర్నవి వెళ్లాలి. రాహుల్ ఆల్రెడీ బయటకు వెళ్లి వచ్చాడు. ఇతడ్ని గతంలో ఓసారి ఎలిమినేట్ చేసినట్టు ప్రకటించిన బిగ్ బాస్, అనూహ్యంగా మళ్లీ హౌజ్ లోకి తీసుకొచ్చాడు. కాబట్టి మరోసారి ఇతడ్ని ఎలిమినేట్ చేసినా ప్రేక్షకులు నమ్మరు. కాబట్టి పునర్నవి బయటకు వెళ్లడం ఖాయమని దాదాపు అందరికీ తెలిసిపోయింది. అదే నిజమైంది.
హౌజ్ నుంచి బయటకొచ్చిన పునర్నవి బిగ్ బాస్ లో తన జర్నీకి సంబంధించిన వీడియో చూసి భావోద్వేగానికి గురైంది. పునర్నవి కోసం రాహుల్ ఓ పాట పాడాలంటూ నాగార్జున కోరగా.. రాహుల్ పాడేందుకు ప్రయత్నించాడు. కానీ అతడి వల్ల కాలేదు. తనకు ఎంతో క్లోజ్ అయిన పునర్నవి బయటకు వెళ్లిపోవడంతో అతడు ఒకటే ఏడుపు.
మళ్లీ మళ్లీ పాడ్డానికి ప్రయత్నించినప్పటికీ అతడి వల్ల కాలేదు. దీంతో స్వయంగా నాగార్జునే ఓ సాంగ్ ప్లే చేసి ఆ కార్యక్రమాన్ని ముగించాడు. హౌజ్ నుంచి బయటకొచ్చిన పునర్నవి, రాహుల్ తో చనువుగా ఉన్న అంశంపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.