పుష్ప 2…ఏం జరుగుతోంది?

పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పుష్ప 2 మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దానికి తోడు ఆ సినిమా సెట్ మీదకు వెళ్లడానికి టైమ్ పడుతోంది. ఇలాంటి నేపథ్యంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్…

పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పుష్ప 2 మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దానికి తోడు ఆ సినిమా సెట్ మీదకు వెళ్లడానికి టైమ్ పడుతోంది. ఇలాంటి నేపథ్యంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా? ఎప్పుటికి రెడీ అవుతుంది? అని చాలా అంటే చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. 

ఇలాంటి టైమ్ లో నిన్నటికి నిన్న కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ ఫొటొల్లో గురు శిష్యులు సుకుమార్..బుచ్చిబాబు సీరియస్ స్టోరీ, స్క్రిప్ట్ డిస్కషన్ లో వున్నారు. ఆ ఫొటొలు బుచ్చిబాబు తన మిత్రుడికి పంపితే, అతగాడు సోషల్ మీడియాలోకి వదిలాడు. ఆ విధంగా అవి బయటకు వచ్చాయి. అక్కడి దాకా బాగానే వుంది.

కానీ ఆ ఫొటోలు పట్టుకుని మీడియా రాసుకున్న వార్తలే తేడా అయ్యాయి. ఇంకా స్క్రిప్ట్ కాలేదా? అసలు బుచ్చిబాబు వచ్చి ఇప్పుడు టీమ్ లో చేరడం వల్ల ఆలస్యం అవుతోందా? ఇలా రకకరాల వార్తలు వచ్చేసాయి. అనకూడదు కానీ ఇవి కొంత డ్యామేజ్ కూడా చేసే వుంటాయి. 

ఎందుకంటే ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ చేసే రెండో సినిమా దర్శకుడు తన సినిమా స్క్రిప్ట్ కు సాయం పట్టడం ఏంటీ అని హీరో బన్నీ కూడా అనుకోవచ్చు కదా. అలాగే తనకు బుచ్చిబాబు సాయం చేయడం ఏమిటి అని సుకుమార్ కూడా అనుకోవచ్చు.

మొత్తానికి ఇప్పుడు అసలు నిజం బయటకు వచ్చేసింది. అసలు సంగతి ఏమిటంటే పుష్ప 2 స్క్రిప్ట్ లాక్ అయిపోయిందట. శ్రావణమాసంలో పూజ చేసి, హైదరాబాద్ లోనే షూటింగ్ ప్రారంభిస్తారట. సరే, ఇంతకీ నిన్నటికి నిన్న వచ్చిన ఫొటొలు ఏమిటి? అని ఆరా తీస్తే..

ఎన్టీఆర్ తో తాను చేయాలనుకునే సినిమా స్క్రిప్ట్ ను ఓసారి సుకుమార్ కు నెరేషన్ ఇచ్చాడట బుచ్చిబాబు. రెండు రోజుల పాటు ఆ నెరేషన్ విని సుకుమార్ సలహాలు సూచనలు ఇచ్చాడట. ఆ సందర్భంలో తీసిన ఫొటోలు ఇలా రివర్స్ అయ్యాయి. 

అయినా ఇలా శిష్కుల సినిమాల స్క్రిప్ట్ లు వింటూ సలహాలు ఇస్తూ కూర్చుంటే మన సినిమా లేటయిపోతుందని సుకుమార్ ఎప్పుడు అనుకుంటారో?