ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై సినీ నిర్మాత అశ్వినీదత్ తన కడుపు మంటను మరోసారి బయట పెట్టుకున్నారు. ఈ సారి ఆయన జగన్‌పై విమర్శలకు తిరుపతిని ఆయుధంగా ఎంచుకున్నారు. అంటే మతపరమైన విద్వేషాన్ని చిమ్మడానికి కూడా ఆయన వెనుకాడడం లేదని అర్థమవుతోంది. సీతారామం చిత్ర ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతిని ఏపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని విరుచుకుపడ్డారు.
స్వామి ఇంకా ఆ పాపాలు ఎందుకు చూస్తున్నాడో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఈ మూడేళ్లలో జగన్ ప్రభుత్వ అన్యాయాల్ని ఊహించలేం అనే వరకూ అశ్వినీదత్ వెళ్లారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తాడనే కామెంట్‌తో ఆయన ఉద్దేశం ఏంటో చెప్పకనే చెప్పారు. సీఎం జగన్‌పై అశ్వినీదత్ ఏ స్థాయిలో అక్కసు కలిగి ఉన్నారో తనకు తానుగా బయట పెట్టుకున్నారు.
జగన్ ప్రభుత్వంపై అశ్వినీదత్ విద్వేషాన్ని అర్థం చేసుకోవాల్సిందే. ఆయన కోపాగ్ని వెనుక అసలు కారణం ఏంటో బహిరంగ రహస్యమే. జగన్ ప్రభుత్వంపై ఇప్పటికే ఆయన న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. ఆ విషయం ఏంటో తెలిస్తే… జగన్ ప్రభుత్వంపై అశ్వినీదత్ కోపం వెనుక కారణం అర్థమవుతుంది. చంద్రబాబు హయాంలో గన్నవరం విమానాశ్రయ విస్తరణ చేపట్టారు. ఆ ప్రాంతంలో అశ్వినీదత్‌కు 40 ఎకరాల భూమి ఉంది.
ఆ భూమిని గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణకు ఇచ్చారు. ఇందుకు ప్రతిఫలంగా అమరావతి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇస్తానని హామీ ఇచ్చింది. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి విషయంలో తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఈ చర్య అశ్వినీదత్‌కు భారీగా నష్టం కలిగించింది.
చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈ ప్రభుత్వం నెరవేర్చకపోతే తాను నష్టపోతానని ఆయన ఆవేదన. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. జగన్ ప్రభుత్వ చర్య వల్ల తాను నష్టపోతానని, రూ. 210 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టుకెక్కారు. విమానాశ్రయానికి ఇచ్చిన మొత్తం భూమి విలువకు ఇపుడు నాలుగురెట్లు చెల్లించాలని కోర్టులో కేసు వేయడం సంచలనం రేకెత్తించింది. అంతేకాదు, రూ. 210 కోట్ల పరిహారంతో పాటు ల్యాండ్ రెంటును కూడా చెల్లించాలని అశ్వినీదత్ కోరుతున్న సంగతి తెలిసిందే.
ఆర్థికంగా భారీ నష్టం కలిగించిన జగన్ ప్రభుత్వంపై అశ్వినీదత్‌కు కోపం రాకుండా, ప్రేమ పుడుతుందా? అనే ప్రశ్నలొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మత మార్పిళ్లు జరుగుతుంటే చినజీయర్ స్వామి ప్రశ్నించకపోగా, గతంలో ఓ స్థూపం ఆవిష్కరణ సందర్భంగా జగన్‌ను దైవాంశ సంభూతుడని పొగిడారని, ఆ మాటలు కడుపు మండేలా చేశాయని అశ్వినీదత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఆయన కడుపు మంట వెనుక అసలు కథ అదన్న మాట. అశ్వినీదత్ లాంటి ప్రముఖ నిర్మాత ఇంత బాహాటంగా ఏపీ ప్రభుత్వంపై తన వ్యతిరేకతను బయట పెట్టుకున్నారంటే, దాని వెనుక ఆర్థికపరమైన అంశాలు ముడిపడి వుంటాయని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే సంబంధాలన్నీ ఆర్థికంతో ముడిపడి వున్నాయి కాబట్టి.