మొన్నటివరకు సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో బిజీగా గడిపిన రాశీఖన్నా.. ఆ షూటింగ్ ముగించుకొని ఇండియాకొచ్చింది. ఇలా వచ్చిన వెంటనే అలా తనకు తోచిన రీతిలో సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఈ కరోనా కష్టకాలంలో సెలబ్రిటీ స్టేటస్ ఉండడం చాలా ఉపయోగమని.. సెలబ్రిటీలంతా తమ హోదాతో సమాజానికి చాలా మంచి చేస్తున్నారని అంటోంది రాశీ ఖన్నా.
“సెలబ్రిటీ స్టేటస్ అంటే ఇదే. ఓ వ్యక్తికి ఈ హోదా ఉండడం వల్ల సమాజానికి ఎంత ఉపయోగమో ఇప్పుడు అర్థమౌతోంది. కొంతమంది సెలబ్రిటీలు చేస్తున్న ఛారిటీ చాలా బాగుంది. ఈ టైమ్ లో సోషల్ మీడియా కూడా ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ కరోనా కష్టకాలంలో అందర్నీ కలుపుతోంది సోషల్ మీడియానే. ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉన్న సెలబ్రిటీలంతా ఈ కష్టకాలంలో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.”
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలామంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారన్న రాశీఖన్నా.. ఒక్కరిగా కాకుండా, అంతా చేతులు కలిపితే ఇలాంటి సమయాల్లో చాలా బాగుంటుందని అభిప్రాయపడింది.
“అవసరం చాలా పెద్దది. ఒక్కరు ఏం చేయలేరు. అందరూ చేతులు కలపాలి. అందుకే నేను కొన్ని ఎన్జీవో సంస్థలతో అసోసియేట్ అవుతున్నాను. నా స్థాయిలో నేను చేస్తున్నాను. ఆకలితో ఉన్న పేదలకు కడుపు నింపితే అదే చాలు. అందుకే రోటీ బ్యాంక్ తో పాటు మరికొన్ని స్వచ్చంధ సంస్థలతో చేతులు కలిపాను.”
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నాగచైతన్యతో కలిసి థ్యాంక్ యు అనే సినిమా చేస్తోంది. మలయాళంలో అంధాధూన్ రీమేక్ లో నటిస్తోంది. దీంతో పాటు షాహిద్ కపూర్ తో కలిసి ఓ వెబ్ మూవీ చేస్తోంది.