ఒకవైపు ప్రభుత్వాలు మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు సమాయత్తం అవుతున్నాయి. ప్రత్యేకించి మూడో వేవ్ ప్రమాదం పిల్లలకే ఎక్కువ అనే ఊహాగానాల నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అంశంపై సమీక్ష నిర్వహించి, ఏపీలో మూడు ప్రత్యేక ఆసుపత్రులను యుద్ధప్రాతిపదికన రెడీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇలా మూడో వేవ్ ఉంటుందనే అంచనాలతో వైద్య సదుపాయాలను సమకూర్చుకోవడం మంచిదే. అక్కడకూ జగన్ నిర్వహించిన సమావేశంలో పలువురు వైద్య నిపుణులు మూడో వేవ్ పిల్లలపై అనేందుకు ఆధారాల్లేవని ప్రస్తావించారట. ఎందుకైనా మంచిది, వేవ్ ఉంటుందనే రెడీ కావాలని జగన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.
ఆ సంగతలా ఉంటే.. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దప్ గులేరియా మూడో వేవ్ గురించి తన విశ్లేషణ వినిపించారు. ఆయన ముఖ్యంగా చెబుతున్నదేమిటంటే.. మూడో వేవ్ ప్రత్యేకంగా పిల్లలపై ప్రభావం చూపుతుంది అనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవనేది! ఇప్పటి వరకూ కరోనా ప్రభావం గురించి దేశీయ డాటాను, అంతర్జాతీయ డాటాను కూలంకషంగా పరిశీలించిన అనంతరమే తను ఈ మాట చెబుతున్నట్టుగా ఈ ప్రముఖ వైద్యుడు చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఇప్పటికే పలు దేశాల్లో పలు వేవ్స్ లో వచ్చి వెళ్లిందని, అక్కడ కరోనా బారిన పడ్డ పెద్దవాళ్ల, పిల్లల డాటాను, అలాగే ఇండియాలో ఫస్ట్ వేవ్ లో, సెకెండ్ వేవ్ లో ప్రభావితం అయిన పిల్లల సమాచారాన్ని తీసుకుని గులేరియా విశ్లేషించారు.
సెకెండ్ వేవ్ లో దేశంలో అనేక మంది చిన్నారులు కరోనా పాజిటివ్ గా తేలారు. అయితే అదృష్టవశాత్తూ వారిపై తీవ్ర ప్రభావాలు చాలా చాలా తక్కువ. కరోనాకు గురైన అనేక మంది చిన్నారులు హోం ఐసొలేషన్‌లోనే, చాలా తక్కువ స్థాయి మెడిసిన్స్ వాడటంతోనే కోలుకున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.
వారిలో కూడా చాలా మంది సులువుగానే కోలుకున్నారు. గులేరియా ఈ విషయాలను చెబుతున్నారు. అలాగే అంతర్జాతీయ సమాచారాన్ని బట్టి చూసినా.. ఇప్పటి వరకూ కరోనా పిల్లలపై చూపించిన ప్రభావం పరిమితమైనది అని గులేరియా స్పష్టం చేస్తూ ఉన్నారు.
వివిధ దేశాల్లో కరోనా అనేక దశల్లో వ్యాపించింది ఇప్పటికే. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఎక్కడా ప్రత్యేకంగా పిల్లలపై తీవ్ర స్థాయి ప్రభావం చూపిన దాఖలాలు ఏవీ లేవని ఈ డాక్టర్ కుండబద్ధలు కొడుతున్నారు.
మూడో వేవ్ పిల్లలపైనే ఉంటుందంటూ కొన్ని మీడియా వర్గాలు హోరెత్తిస్తూ, ప్రజలను భయకంపితులను చేస్తున్న నేపథ్యంలో.. ఒక ప్రముఖ డాక్టర్, ఎయిమ్స్ డైరెక్టర్, కూలంకషమైన డాటాతో అలాంటి భయాలు పెట్టుకోవద్దని చెబుతూ ఉండటం తల్లిదండ్రులకు ఊరటను ఇచ్చే అంశం. ప్రభుత్వాలు మూడో వేవ్ ను ఎదుర్కొనడానికి తమ ఏర్పాట్లు తాము చేయవచ్చు. కరోనా మరో వేవ్ లేకుండా పోతే అందరికీ ఆనందమే. అలాగని అతిగా టీవీ చానళ్లను చూసి అనవసరమైన భయాందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ విశ్లేషణను బట్టి స్పష్టం అవుతోంది.