ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నిక జరిపే సీన్ లేక, రాహుల్ కి ధైర్యం చాలక కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దిగాలుగా ఉంది. ఇలాంటి టైమ్ లో తెలంగాణకు అధ్యక్షుడిని నియమించండి అంటూ ఆ రాష్ట్ర నేతల నుంచి తీవ్ర డిమాండ్ ఎదురవుతోంది.
సాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యాక చూసుకుందామంటూ.. అప్పట్లో అసంతృప్త జ్వాలల్ని చల్లార్చే ప్రయత్నం చేశారు, ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీరింది కదా.. ఇంకెప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు నేతలు. అసలు తెలంగాణలో కాంగ్రెస్ కి అధ్యక్షుడిని నియమిస్తారా లేదా అంటూ నిష్టూరమాడుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అస్త్ర సన్యాయం చేస్తానన్నారు. అప్పుడే వద్దు, కొత్త కెప్టెన్ నియమించేంత వరకు ఉండండి అంటూ సర్దిచెప్పింది అధిష్టానం. ఏళ్లు గడుస్తున్నాయి కానీ, కాంగ్రెస్ పెద్దలు తెలంగాణలో పార్టీని పట్టించుకోలేదు. ఈలోగా బీజేపీ పుంజుకుంటుండే సరికి వారిలో గుబులు మొదలైంది.
దుబ్బాక, సాగర్ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఎమ్మెల్సీ పోరు, స్థానిక సంగ్రామం.. ఇలా ఎక్కడ చూసినా కాంగ్రెస్ స్కోర్ కార్డ్ ఓపెన్ చేయలేకపోయింది. నాయకుడు లేని పార్టీ పరిస్థితి ఇంతే, కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం మేమేనంటూ మరోవైపు బీజేపీ జబ్బలు చరుస్తోంది.
ఈ దశలో ఈటల వ్యవహారం కాంగ్రెస్ కి మరింత తలనొప్పిగా మారింది. బీజేపీలో చేరబోతున్న ఈటల హుజూరూబాద్ ఉప ఎన్నికల్లో సత్తా చూపిస్తానంటున్నారు. అటు టీఆర్ఎస్ కూడా ప్రతి వ్యూహాలు రచిస్తోంది. హుజూరాబాద్ లో బీజేపీకి ఎప్పుడూ పెద్ద సీన్ లేదు, కాంగ్రెస్ మాత్రమే అక్కడ టీఆర్ఎస్ కి పోటీ ఇస్తోంది. ఇప్పుడు ఈటల బీజేపీ టికెట్ పై పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్ తన ఓటు బ్యాంకుని కాపాడుకోవాల్సిన పరిస్థితి.
కనీసం ఇప్పుడైనా టీపీసీసీ అధ్యక్షుడిని నియమిస్తే.. ఆ ఉత్సాహంతో హుజూరాబాద్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు పనిచేసే అవకాశం ఉంది. పీసీసీ పీఠం ఇస్తే.. నియోజకవర్గం మొత్తం కలియదిరిగి పార్టీకి జవసత్వాలు తెస్తానంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇస్తే పీసీసీ ఇవ్వండి, లేకపోతే ఏదీ వద్దు అని అల్టిమేటం ఇచ్చారు.
అటు రేవంత్ రెడ్డి పేరు కూడా టీపీసీసీ రేసులో బలంగా వినపడుతోంది. కరోనా కష్టకాలంలో తెలంగాణలో రేవంత్ రెడ్డిదే కాస్త హడావిడి కనిపించింది. రేవంత్ పై అధిష్టానం సాఫ్ట్ కార్నర్ తో ఉన్నా.. స్థానికంగా ఆయన నాయకత్వాన్ని సీనియర్లు ఒప్పుకోవడం లేదు.
టీడీపీ నుంచి వచ్చారన్న ఒకే ఒక్క కారణం ఆయనకు మైనస్ పాయింట్. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు రిటైర్మెంట్ వయసులో నాకోసారి పదవి ఇవ్వొచ్చుకదా అని లాబీయింగ్ చేస్తున్నారు. జగ్గారెడ్డి కూడా తనవంతు ప్రయత్నాల్లో ఉన్నారు.
సాగర్ ఉప ఎన్నికల సాకుతో టీపీసీసీ అధ్యక్ష ఎన్నికను వాయిదా వేసిన అధిష్టానానికి, ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక ముంచుకు రావడంతో ఆ తంతు పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. కాంగ్రెస్ నేతలు చేజారకుండా ఉండాలంటే, వారిలో భరోసా నింపే ప్రయత్నం చేయాలి, బలమైన నాయకుడిని నియమించాలి. జాతీయ స్థాయిలోనే నాయకత్వంలేని కాంగ్రెస్ కి… రాష్ట్రాలపై దృష్టి పెట్టేంత సీన్ ఉందా అనేది తేలాల్సి ఉంది.