రాహుల్ సిప్లిగంజ్… బిగ్‌బాస్ రియాల్టీ షో విన్నర్‌గా నిలిచిన తర్వాత సెలబ్రిటీ స్టేటస్ పొందారు. పబ్ కేంద్రంగా ఆయన పేరు వివాదాస్పదం కావడం ఇది రెండోసారి. గతంలో పబ్‌లో గొడవ జరిగి, ఆయన తలను పగలగొట్టిన సంగతి తెలిసిందే.
గత రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన వారిలో రాహుల్ సిప్లిగంజ్ పేరు ప్రముఖంగా వినిపించింది. పాపం ఇతని వెనుకా, ముందూ ఎవరూ సెలబ్రిటీలు లేకపోవడంతో మీడియా యథేచ్ఛగా రాహుల్ పేరును ప్రముఖంగా ప్రచారం చేసింది. మిగిలిన 150 మంది విషయానికి వచ్చే సరికి బడా బాబుల పిల్లలనో, మాజీ డీజీపీ కుమారుడో, కుమార్‌తో… ఇలా సంకేతాలతో పబ్ కథనాలను చానళ్లు నడిపాయి.
ఇదిలా వుండగా తాను డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడినట్టు ప్రముఖంగా వార్తలు ప్రసారం కావడంపై రాహుల్ సిప్లిగంజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రెండ్స్ బర్త్‌డే పార్టీకి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లినట్టు రాహుల్ వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న తనను బద్నాం చేసేలా కథనాలు వండివార్చుతున్నారని వాపోయారు. తనతో పాటు అన్నయ్య , ఫ్యామిలీకి చెందిన మహిళలు కూడా ఉన్నట్టు రాహుల్ తెలిపారు.
పబ్‌లో తాను డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. అసలు తనకు ఆ అలవాటే లేదన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తెలంగాణ పోలీసులతో కలిసి ప్రచారం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. డ్రగ్స్ తీసుకోవద్దని ఇతరులకు చెప్పే తాను, ఆ తప్పు పని ఎలా చేస్తానని ప్రశ్నించడం గమనార్హం.
తాను డ్రగ్స్ తీసుకోలేదని నిరూపించుకునేందుకు ఎలాంటి పరీక్షకైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. తనపై ప్రసారమవుతున్న అసత్య కథనాలతో కుటుంబ సభ్యులు, మిత్రులు తీవ్ర వేదనకు గురి అవుతున్నట్టు రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు.