‘ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం’ అన్నారు జాతిపిత గాంధీజీ. మారిన కాలమాన పరిస్థితుల్లో ఈ మాటకు పెడర్థాలు తీసేవాళ్లు ఎక్కువయ్యారు. బంజారాహిల్స్‌లో సుమారు 150 మంది రేవ్ పార్టీలో పట్టుబడితే, వారిలో 35 మంది వరకూ అమ్మాయిలున్నట్టు సమాచారం. వీరిలో కొందరు డ్రగ్స్, మద్యం తీసుకున్నట్టు పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. అసలు ఇవేవీ తీసుకోలేదని కూడా కాసేపు అనుకుందాం.
పబ్‌ల వెంట యుక్త వయసులో వున్న అమ్మాయిలు తిరగడం ఏంటి? ఇలా తిరగడం ఏ సంస్కృతి, సంప్రదాయాల పరిధిలోకి వస్తుందో పట్టుబడిన యువతుల తల్లిదండ్రులే చెప్పాల్సి వుంటుంది. పబ్‌ల వెంట తిరుగుతూ గొబ్బు పనులు చేస్తూ, పట్టుబడితే వక్రభాష్యాలు, విపరీత ధోరణులకు వెళ్లడం న్యాయమేనా? పిల్లలు అవాంఛనీయ ఘటనల్లో పట్టుబడితే, పరువు కాపాడుకునేందుకు కప్పి పుచ్చుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు.
కానీ పిల్లలు ఎలా తిరుగుతున్నారు? ఎవరితో తిరుగుతున్నారు? వారి స్నేహాలు, అలవాట్లు తదితర అంశాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోతే, చివరికి మానసిక క్షోభను తామే అనుభవించాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఎందుకు గ్రహించడం లేదు?
‘ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం’ అని గాంధీజీ చెప్పింది…. పబ్‌లు, బార్‌లకు వెళ్లే మహిళల కోసం ఎంత మాత్రం కాదని గ్రహించేదెప్పుడు? ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ప్రస్తుత సమాజ పోకడలు తెలిసి కూడా స్వేచ్ఛ పేరుతో గాలికి వదిలేయడం వల్లే ….పబ్‌లలో డ్రగ్స్, మద్యం తీసుకోవడం లాంటి అవాంఛనీయ ఘటనల్లో తమ బిడ్డల్ని నిందితులుగా చూడాల్సి వస్తుందనే వాస్తవాన్ని గ్రహించాలి.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా… ఇంకా కొంత మంది సెలబ్రిటీ తల్లిదండ్రులు… తమ కూతురు నిప్పు, పప్పు అని వెనకేసుకొస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలా వదిలేస్తే …భవిష్యత్‌లో తమ కుటుంబ పరువు ప్రతిష్టలను దహనం చేస్తుందని చేదు నిజాన్ని జీర్ణించుకోవాల్సి వుంటుంది. కావున పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను తాజా పబ్ ఉదంతం తెలియజేస్తోంది.