సీనియర్ నటి హేమ బాధ వర్ణణాతీతం. బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ బయటపడడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఇందులో సుమారు 150 మంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. వివిధ రంగాల సెలబ్రిటీలు పట్టుబడడంతో కేసు నీరుగార్చే ప్రయత్నాలు వేగవంతమయ్యాయనే చర్చకు తెరలేచింది.
ఇందులో కొందరి ప్రముఖుల పేర్లు పోలీసుల లిస్టులో లేకపోవడంతో అనుమానాలే నిజమయ్యాయనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలో నటి హేమ పేరు కూడా తెరపైకి రావడం తీవ్ర దుమారం రేపింది. అసలు పబ్‌కే వెళ్లని తనపేరును ఏ విధంగా ప్రచారంలోకి తెస్తారంటూ ఆమె ఆవేశంతో మీడియా ప్రతినిధులను నిలదీశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న చానళ్లపై ఫిర్యాదు చేసేందుకు ఆమె బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను అసలు పబ్‌కు వెళ్లలేదన్నారు. అలాంటప్పుడు తన పేరును డ్రగ్స్ కేసులో ఎలా ఇరికిస్తారని ఆమె ప్రశ్నించారు. డ్రగ్స్ కేసు అనేది చిన్న విషయం కాదన్నారు. తనకు కూతురు, కుటుంబం ఉందని, సంబంధం లేని విషయంలో దుష్ప్రచారం చేయడం ద్వారా ఎంతగా ఆవేదన చెందాల్సి వస్తున్నదో అర్థం చేసుకోవాలని కోరారు. కొందరు కావాలనే తన పేరును ప్రసారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనను ఓ చెల్లిగా, కుటుంబ సభ్యురాలిగా భావించి, తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఎంత మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తుందో అర్థం చేసుకోవాలని విన్నవించారు. తాను మొత్తం మీడియాను నిందించడం లేదని, పనిగట్టుకని దుష్ప్రచారం చేస్తున్న మీడియా ప్రతినిధులను మాత్రమే ప్రశ్నిస్తున్నట్టు హేమ తెలిపారు. పబ్‌కు వెళ్లకుండానే ఆమె పేరు తెరపైకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హేమ ఆవేదనలో అర్థం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.