ఇవాళ మెగా ఫ్యామిలీ మానసికంగా కుంగిపోయింది. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో డ్రగ్స్ కేసులో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పేరు ప్రముఖంగా వినిపించడం సహజంగానే మెగాస్టార్ కుటుంబాన్ని షాక్‌కు గురి చేసింది. నాగబాబు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు ఓ వీడియోను విడుదల చేశారు.
డ్రగ్స్ కేసులో నిహారికకు అసలు సంబంధమే లేదని పోలీసులు చెప్పారన్నారు. నిహారిక విషయంలో తాము క్లియర్‌గా ఉన్నట్టు ఆయన వెనకేసుకొచ్చారు. నిజానిజాల సంగతిని పక్కన పెడితే, అవాంఛనీయ ఘటనలో నిహారిక పేరు తెరపైకి రావడం తండ్రిగా నాగబాబు ఆవేదనను అర్థం చేసుకోవచ్చు.
నిహారిక విషయమై పెద్ద ఎత్తున మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఆమె బాబాయ్, జనసేనాని పవన్‌కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. నిహారికకు క్లాస్ తీసుకుంటున్నట్టుగా ఆ ట్వీట్‌పై సోషల్ మీడియాలో అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ట్వీట్ ఏంటంటే…
బీసీలు, ఎస్సీలు కలిసి రాజ్యాధికారాన్ని సాధించేందుకు రామ్‌మనోహర్ లోహియా ఆలోచనల్ని పంచుకుంటూ రచయిత వాకాడ శ్రీనివాస్ కోట్‌ను తాను ప్రస్తావిస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు. “శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది… అవతలివాడు మనల్ని వాడుకోవడమే మన విజయం అని భ్రమ పడేంత అమాయకత్వం కూడా మనదే…” అని ట్వీట్ చేశారు.
ప్రస్తుతం తెలుగు సమాజంలో తీవ్ర చర్చనీయాంశమైన ప్రముఖుల పిల్లల డ్రగ్స్ వ్యవహారంపైన్నే పవన్ ట్వీట్ చేసినట్టు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తన అన్న కుమార్తె నిహారిక పేరుపై రచ్చ సాగుతుండడంపై పవన్ తన అసహనాన్ని పరోక్షంగా వెల్లడించినట్టు చెబుతున్నారు. ఇలాంటి చర్యలతో ప్రత్యర్థులకు ఆయుధం ఇచ్చినట్టైందని పవన్ ట్వీట్ సారాంశంగా చెబుతున్నారు.
డ్రగ్స్ వ్యవహారంలో నాగబాబు చెబుతున్నట్టు నిహారికకు సంబంధం లేకపోయినా…. ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు చేజేతులా అవకాశం ఇచ్చినట్టైందని పవన్ ఆగ్రహంగా ఉన్నట్టు, ఈ ట్వీట్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చం టున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నిహారికది మూర్ఖత్వమని పవన్‌కల్యాణ్ తన ట్వీట్ ద్వారా పరోక్షంగా చెప్పకనే చెప్పారనేది మెజార్టీ అభిప్రాయం.