టాలీవుడ్ లో సూపర్ హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి, బాహుబలి ఫ్రాంచైజీతో పాన్-ఇండియా డైరక్టర్ అయ్యాడు. అయితే ఇక్కడితో ఆగిపోవడం లేదు జక్కన్న. ఇప్పుడు తన ఫోకస్ ను హాలీవుడ్ పై పెట్టాడు. అవును.. త్వరలోనే ఓ ఇంటర్నేషనల్ ఫిలిం చేయబోతున్నాడు ఈ దర్శకుడు.
హాలీవుడ్ సినిమా అంటే.. రాజమౌళి హాలీవుడ్ కు వెళ్లి అక్కడి హీరోహీరోయిన్లు, టెక్నీషియన్స్ తో సినిమా చేయడు. భారతీయ కథనే తీసుకొని, హాలీవుడ్ టెక్నీషియన్స్ తో అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మేరకు ఓ ప్రముఖ హాలీవుడ్ సంస్థతో అగ్రిమెంట్ కూడా పూర్తయింది.
రాజమౌళి హాలీవుడ్ సినిమాకు సంబంధించి కథ దాదాపు ఖరారైంది. తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతోనే రాజమౌళి, ఇంటర్నేషనల్ ఫిలిం చేయబోతున్నాడు. ఆ సినిమాలో గ్రాఫిక్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండబోతోంది.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. ఈ ప్రాజెక్టు తర్వాత లెక్కప్రకారం మహేష్ బాబుతో సినిమా చేయాలి. ఆ విషయాన్ని రాజమౌళి నిర్థారించాడు కూడా. బహుశా మహేష్ బాబుతో సినిమా పూర్తయిన తర్వాత ఇంటర్నేషనల్ మూవీపై రాజమౌళి దృష్టి పెడతాడేమో.