ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన తర్వాత, దాన్ని టీడీపీ విజయంగా చెప్పుకోడానికి ఆ పార్టీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అసలు ఆనందయ్య ఎపిసోడ్ మొదలైన వెంటనే దాన్ని టీడీపీ హైజాక్ చేయాలని చూసింది. స్థానిక నాయకుడు, ప్రత్యక్ష ఎన్నికల ఓటముల్లో హ్యాట్రిక్ వీరుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి హంగామా చూస్తే అసలు ఆనందయ్యను ఆయన దత్తత తీసుకున్నారా అనిపించక మానదు.
కొన్నిరోజులుగా పార్టీ వ్యవహారాలను పూర్తిగా పక్కనపెట్టిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనందయ్య ఊరి చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే.. ఇప్పటి వరకూ ఆనందయ్యను ఆయన ఒక్కసారి కూడా నేరుగా కలవలేదు. ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి మినహా ఇతర వైసీపీ నాయకులు కూడా ఆనందయ్యతో నేరుగా టచ్ లోకి వెళ్లలేదు, ఆ ఎపిసోడ్ ని వైసీపీ రాజకీయం చేయాలనుకోలేదు. అయితే టీడీపీ మాత్రం ఆనందయ్య పేరుతో ఏదో చేసేయాలనుకుంది.
ఆనందయ్య మందుని ప్రభుత్వం ఆపేసిందని, అది ప్రభుత్వ కుట్రేనని విషప్రచారం కూడా మొదలు పెట్టింది. మరోవైపు ఇదే టీడీపీ నాయకులు.. ఆనందయ్య మందుని అన్ని అనుమతులు వచ్చాకే పంపిణీ చేయాలంటూ అడ్డుపడ్డారు. మందు పంపిణీకి అడ్డుపడింది వీరే, ప్రభుత్వం మందు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని విమర్శలు చేసింది కూడా వీరే. ప్రజల్ని రెచ్చగొట్టాలని చూసినా అది వర్కవుట్ కాలేదు.
కృష్ణపట్నంలో డ్రామాలు రక్తి కట్టలేదు..
ఆనందయ్య మందు పంపిణీకి విరామం ఇచ్చిన తర్వాత సోమిరెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది నేతలు కృష్ణపట్నం వెళ్లారు. అలా వెళ్లినవారు ఊరుకోకుండా ఓ చిన్న డ్రామా ఆడారు. ఓ యువకుడు కరోనాతో ఇబ్బంది పడుతున్నట్టు, అతనికి ఆనందయ్య శిష్యులు కంటిలో చుక్కల మందు వేసినట్టు, ఆ తర్వాత అతను కోలుకున్నట్టు సీన్ క్రియేట్ చేశారు.
అసలు ఆనందయ్యే మందు తయారీ ఆపేసి ఊరికి దూరంగా ఉంటుందే.. ఆయన శిష్యుల పేరుతో సోమిరెడ్డి ఆడించిన డ్రామాలపై స్థానికులు మండిపడ్డారు. ఆనందయ్య శిష్యుల పేరుతో నకిలీమందు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం రావడంతో సోమిరెడ్డి టీమ్ వెంటనే వెనక్కు తగ్గింది.
ఆనందయ్యకు పోలీసులు రక్షణ కల్పించిన సందర్భంలో కూడా ఆయన్ని అరెస్ట్ చేశారంటూ తప్పుడు ప్రచారం చేసి తిప్పలు కొనితెచ్చుకున్నారు సోమిరెడ్డి. మందుకి అనుమతివ్వాలంటూ ప్రజల కంటే ఎక్కువగా ఆందోళన చేసిన సోమిరెడ్డి, మరికొన్నాళ్లు ఈ ఎపిసోడ్ నడపాలనుకున్నారు. కానీ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఆమోదం ఇచ్చేసరికి కంగుతిన్నారు. ఇప్పుడు తన ప్రయత్నమేదో ఫలించినట్టు తెగ ఇదైపోతున్నారు.
ఆనందయ్య మందుకు పర్మిషన్ వచ్చిందని కరోనా రోగులు సంబర పడుతుంటే.. మధ్యలో సోమిరెడ్డి హంగామా ఏంటో అర్థం కావడంలేదు. మొత్తానికి పబ్లిసిటీ కోసమే ఆనందయ్యను భుజానికెత్తుకున్న సోమిరెడ్డి.. కొన్నిరోజులపాటు మీడియాలో హంగామా చేసి తాను అనుకున్నది సాధించారు.