టీడీపీని తెలుగు డ్రామా పార్టీ అని ఏ క్షణాన, ఎవరన్నారో తెలియదు కానీ…వందకు రెండొందల శాతం ఆ విమర్శకు అర్హమైందే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తానొక రాజకీయ పార్టీ అనే స్పృహ కోల్పోయి, పక్కా డ్రామా కంపెనీనే అని నిరూపించుకునేందుకు తహతహలాడుతోంది. ఎందుకంటే టీడీపీ రాజకీయ కార్యకలాపాలను విడిచిపెట్టి నాటకాలకు పరిమితమైంది. జనాలు అన్నీ చూస్తున్నారనే కనీస జ్ఞానం కూడా ఆ పార్టీలో కొరవడిందనే ప్రత్యర్థుల విమర్శలకు బలం కలిగించేలా , ఆ పార్టీ డ్రామాలు రక్తి కడుతున్నాయి.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ప్రజలకు చేరువ కావాల్సింది పోయి, మరింత దిగజారుడు రాజకీయాలకు ఆ పార్టీ నేతలు పాల్పడుతున్నారు. దీనికి చంద్రబాబు సారథ్యం వహిస్తున్నారు. ప్రజల్లో గౌరవం లేని, చీత్కారానికి గురైన, గురవుతున్న వ్యక్తుల తోక పట్టుకుని, రాజకీయ గోదారి ఈదాలనే టీడీపీ తపన చూస్తే ఎవరైనా నవ్వుకుంటారు. గత కొన్ని నెలలుగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు భుజాలపై తుపాకి పెట్టి, జగన్ ప్రభుత్వంపై తూటాలు పేల్చే ప్రయత్నం టీడీపీ చేసిందనే బలమైన విమర్శలున్నాయి.
అది కాస్తా వికటించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రఘురామను మీడియా తెరపై తెచ్చే అవకాశం టీడీపీ కోల్పోయింది. దీంతో మరో క్యారెక్టర్‌ను ముందుకు తెచ్చి సరికొత్త నాటకానికి టీడీపీ తెరతీసింది. నిన్నటి వరకు నరసాపురం ఎంపీ రఘురామపై ఏపీ సీఐడీ పోలీసుల కేసు, అరెస్ట్ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రఘురామ తనయుడు భరత్ కొన్ని గెస్ట్ రోల్ పోషించారు.
ఇప్పుడు వారి స్థానాల్లో కొత్త క్యారెక్టర్లు తెరపైకి వచ్చాయి. సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణను అడ్డు పెట్టుకుని జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మే ప్రయత్నాలను కొనసాగించేందుకు టీడీపీ విశ్వప్రయత్నం చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలనరుకుతానని ఎల్లో చానల్ వేదికగా ప్రతిజ్ఞ చేసిన రామకృష్ణ… చివరికి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సి వచ్చింది.
ఏకంగా సీఎం ప్రాణాలనే తీస్తానన్న రామకృష్ణకు ఇప్పుడు జైల్లో చావు భయం వెంటాడుతుండటం విచిత్రంగా ఉంది. రామకృష్ణ నిమిత్త మాత్రుడని, టీడీపీ ఆడిస్తున్నట్టే ఆడే బొమ్మ అని ప్రత్యర్థులు ఘాటుగా విమర్శిస్తున్నారు. మొన్నంతా తన బ్యారక్‌లోకి అపరిచిత వ్యక్తి వచ్చాడని, నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్‌ను ఎదిరించేంత వాడివా? నీ అంతు చూస్తా …అని తనను బెదిరించిన విషయాన్ని, తన తండ్రి చెప్పినట్టు రామకృష్ణ తనయుడు వంశీకృష్ణ ఆరోపించిన సంగతి తెలిసిందే.
తాజాగా తనతో పాటు జైలు బ్యారక్‌లో ఉన్న వ్యక్తి బెడ్డింగ్‌లో కత్తి దొరికిందని, తనపై చాలా పెద్ద కుట్ర జరుగుతోందని, వెంటనే అందరికీ చెప్పాలని తన తండ్రి చెప్పినట్టు వంశీకృష్ణ మరోసారి కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చాడు. ఆరోపణల వరుసను గమనిస్తే …ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్టు ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. పైగా రామకృష్ణకు భద్రత కల్పించాలని టీడీపీ ముఖ్య నేతల సమావేశంలో డిమాండ్ చేయడాన్ని అధికార పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. రామకృష్ణ తనయుడి న్యాయపోరాటానికి మద్దతు ఇవ్వాలని కూడా చంద్రబాబు నేతృత్వంలోని సమావేశంలో తీర్మానించడం గమనార్హం.
మొన్నటి వరకూ రఘురామకృష్ణంరాజు, ఆయన తనయుడు భరత్, ఇప్పుడు రామకృష్ణ, ఆయన తనయుడు వంశీకృష్ణ . డ్రామా సేమ్, క్యారెక్టర్స్ చేంజ్ అని ప్రత్యర్థులు మండిపడుతున్నారు. ఇలాంటి డ్రామాల వల్ల ప్రజల్లో ఎలా బలపడుతుందో టీడీపీ నేతలకే తెలియాలి. ఒక రోజు, ఒక వ్యక్తి ఏదైనా చెప్పారంటే నమ్మొచ్చు. ప్రతిరోజూ ఎవరో ఒకర్ని ముందుకు తెచ్చి డ్రామాలాడితే చివరికి ఛీ కొట్టించుకుంటామనే స్పృహ కోల్పోయినట్టుంది.
రఘురాముడు, రామకృష్ణ యావలో జనం సమస్యలను ప్రతిపక్షం గాలికొదిలేసింది. చివరికి టీడీపీని కూడా జనం వదిలేసే ఓ రోజు తప్పక వస్తుంది. ఎందుకంటే తమను పట్టించుకోని పార్టీని జనం మాత్రం ఎందుకు ఆదరిస్తారు?
సొదుం రమణ