నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీ వాసం ఇంకెంత కాలం? ఇప్పుడిదే అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. రెండు కాళ్లకు పెద్దపెద్ద కట్లు కట్టించుకున్న పెద్ద మనిషి ఇంట్లో విశ్రాంతి తీసుకుని త్వరగా కోలుకోవాలని శత్రువులు కూడా ఆశించారు. అయితే ఆయన ఎప్పుడైతే వీల్‌చైర్‌లో వెళుతూ జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికి కేంద్ర పెద్దలను కలుస్తున్నారో, అప్పుడే ఇదంతా స్క్రిప్ట్‌లో భాగమే అని అందరికీ అర్థమైంది.
రెండురోజుల క్రితం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి మిలటరీ అధికారితో పాటు టీటీడీ అధికారి, మరో ఎస్పీపై ఫిర్యాదు చేశారు. నిన్న జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్‌సీ) చైర్మన్ పీసీ పంత్‌ను కలిసి ఏపీ సీఐడీ అధికారులపై ఫిర్యాదు చేశారు.
తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని , చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకా నయం… ఫోర్త్, ఫిప్త్ డిగ్రీలు తనపై ప్రయోగించారని రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేయలేదని నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. రఘురామపై నెటిజన్స్‌కి ప్రేమ ఎక్కువ కాబట్టి అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోనవసరం లేదు.
ఇక ఈ రోజు అంతర్జాయ మానవ హక్కుల సంఘాన్నో, లేక ఏఏ కేంద్ర మంత్రులను కలిసి ఫిర్యాదు చేస్తారో తెలియదు. ఇంకా ఎల్లో మీడియా ఆయన షెడ్యూల్‌ను విడుదల చేయలేదు. ప్రతిరోజూ ఆయన వీల్‌చైర్‌లో ప్రయాణిస్తూ జగన్ ప్రభుత్వంపై చేస్తున్న అవిశ్రాంత పోరాటం గురించి ఓ పెద్ద స్ఫూర్తిదాయక గ్రంథమే రాయొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భావి రాజకీయ నేతలకు రఘురామకృష్ణంరాజు పోరాట పంథా తప్పక ఉపయోగ పడుతుంది. అది మంచికా, చెడుకా? అనేది ఆయా వ్యక్తులు అర్థం చేసుకునే తీరులో ఉంటుంది.
ఇదిలా ఉండగా, ఫిర్యాదులు చేయడాకిని కాళ్ల నొప్పులు, కట్లు ఏవీ అడ్డురావడం లేదని, రేపో, ఎల్లుండో ఏపీ సీఐడీ అధికారులు విచారణకు నోటీసులు ఇస్తే సహకరిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పుడు తిరిగి కాళ్ల నొప్పులు, బీపీ పెరగడం, మగతగా ఉండటం, నోరు పొడారి పోవడం లాంటి లక్షణాలు తిరిగి మొదటికొస్తాయేమోనని నెటిజన్లు సృజనాత్మక సెటైర్స్ విసురు తున్నారు.
ఏపీ సీఐడీ ఎంక్వైరీ అనే మాట ఎత్తితే చాలు …అబ్బా నొప్పి, అమ్మా నొప్పి, బాబూ చలి జ్వరం అని ఏదో ఒక వ్యవస్థను ఆశ్రయిస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు ఢిల్లీ వాసం ఎంత కాలమో ఎవరూ చెప్పలేరని నిట్టూర్పు విడుస్తున్నారు.
సొదుం రమణ