మెగాస్టార్ చిరంజీవి ఎన్నో గుప్త దానాలు చేసారు. ఇన్నాళ్లు అవి బయటకు రాలేదు. కానీ ఈ మధ్య ఎవరెవరో విడియోలు షేర్ చేస్తూ వాటి వైనాలు వెల్లడిస్తున్నారు. సుమారు 30 కోట్ల ఖర్చుతో చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రలో ఆక్సిజన్ సరఫరా కోసం బ్యాంక్ లకు శ్రీకారం చుట్టారు.
ఇది బృహత్ ప్రయత్నం. దీన్ని ఏ ప్రజా ప్రతినిధి గుర్తించలేదు, ప్రశంసించలేదు. కానీ మెగా క్యాంప్ మాత్రం వీటి విషయంలో మాత్రం పబ్లిసిటీ పీక్స్ లో వుండేలా చూసుకుంటున్నారు. కేవలం తను చేస్తున్న దానాలు తానే చెబితే బాగోదని, కొత్త ట్విట్టర్ హ్యాండిల్ ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు అప్ డేట్ లు ఇస్తున్నారు. మెగాస్టార్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారానికి కౌంటర్ ప్రచారం స్టార్ట్ చేసారు.
జనం పెద్దగా పట్టించుకోవడం మానేసిన ఆంధ్రప్రభ అధినేత ముత్తా గోపాలకృష్ణ ఓ పేద్ద వ్యాసం రాయడం, దానికి చిరు ఫోన్ చేసి ఆయనతో ముచ్చటించడం ఇవన్నీ వాట్సాప్ లో చలామణీ చేయడం జరిగిపోయింది. ముత్తా కు జనసేనతో బంధాలున్న సంగతి తెలిసిందే.
ఇంత జరుగుతున్నా ఆక్సిజన్ బ్యాంక్ లకు రావాల్సిన ప్రచారం రాలేదని ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ ప్రయత్నాన్ని ప్రశంసించడం లేదని కామెంట్ చేస్తున్నారు. చిరంజీవి కూడా ఈసారి ప్రచారాన్ని కాస్త ఎక్కువగానే కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది.
ప్రతి రోజూ వాట్సాప్ లో చలామణీ చేయడానికి ఏదో ఒక కంటెంట్ ఏదో ఒక మూల నుంచి పంప్ చేస్తున్నారు. నిజానికి సోనూ సూద్ కూడా ప్రచారం విషయంలో రెండు ఆకులు ఎక్కువే చదివారు. ఆయన జనాలకు భయంకరంగా సేవ చేస్తున్నారు. రకరకాల కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ చేతికి ఎముకలేనట్లు చేసుకుపోతున్నారు. ఆయన కూడా తను చేస్తున్న పనుల ప్రచారానికి ఎక్కడిక్కడ జనాలను నియమించుకున్నారు. తెలుగు మీడియాలో ఆయన పనుల ప్రచారానికి ఒకరిద్దరు పీఆర్ టీమ్ ను కూడా జీతాలు ఇచ్చి పెట్టుకున్నారు.
చిరు-సోనూ వ్యవహారాలు ఇలా వుంటే పాప్ సింగర్ స్మిత కూడా కోవిడ్ సహాయ కార్యక్రమాలు చేపట్టారు.వీటి ప్రచారాన్ని రెండు న్యూస్ చానెళ్లు తమ భుజాన వేసుకున్నాయి. మొత్తం మీద కోవిడ్ సహాయ కార్యక్రమాలు వాటికి ప్రచార కార్యక్రమాలు జోడు గుర్రాల్లా సాగుతున్నాయి.