జగన్ కు కరోనా సమస్య

వైఎస్ జగన్ కు కరోనా సమస్య గా మారింది. అంటే ఆరోగ్య సమస్య గా కాదు. పాలనా సమస్యగా మారింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. రెండేళ్లలో దాదాపు ఏడాది కాలాన్ని కరోనానే తినేసింది. దృష్టి…

వైఎస్ జగన్ కు కరోనా సమస్య గా మారింది. అంటే ఆరోగ్య సమస్య గా కాదు. పాలనా సమస్యగా మారింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. రెండేళ్లలో దాదాపు ఏడాది కాలాన్ని కరోనానే తినేసింది. దృష్టి మొత్తం కరోనా నియంత్రణ మీద, జనాల ఆరోగ్యం మీద పెట్టాల్సి వచ్చింది.అలాగే కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. అయినా కిందా మీదా పడుతూ, అందిన కాడికి అప్పులు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించకపోయి వుంటే బాబు గారి అను'కుల' మీడియా, హామీలు గాలికి అని ఎకసెక్కాలు ఆడేది. నవరత్నాలు రాలిపోయాయి అంటూ వార్తలు వడ్డించేది. కానీ జగన్ అలాంటి అవకాశం ఇవ్వలేదు. దాంతో అప్పులు చేస్తున్నారు బాబోయ్ అంటూ హడావుడి చేసింది. కానీ జనం దాన్ని పట్టించుకోలేదు.

అది గమనించిన బాబుగారి అను'కుల' మీడియా సంక్షేమం తప్ప, అభివృద్ది లేదు అనే కొత్త రాగం అందుకుంది. రెండేళ్లలో కరోనాపై పోరాటానికే దాదాపు ఏడాది కాలం పోయింది. ఇంక ఏడాది కాలంలో ఎన్ని పనులు చేసేయగలరు అన్నది ఈ మీడియా ఆలోచించడం లేదు. అప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ కొత్త రూపు ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులకు కొత్త రూపు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతోంది. భోగాపురం ఎయిర్ పోర్టు, దానికి విశాఖ నుంచి కనెక్టివిటీ రోడ్ వ్యవహారాలు షురూ అయ్యాయి.

ప్రతి మండలంలో పలు చోట్ల రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల నిర్మాణం జరిగింది. రైతులకు నేరుగా అక్కడే అన్ని సదుపాయాలు అందుతున్నాయి. రాష్ట్రం అంతా ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది. రోడ్ల మరమ్మతుల కోసం భారీగా నిధులు కేటాయించారు. ఇలా వీలయినన్ని చేస్తూనే వస్తున్నారు. పైగా అన్నింటికి మించి ఏ నిర్ణయం తీసుకున్నా, ముందుకు సాగనివ్వకుండా కోర్టుల ద్వారా అడ్డం పడే పని నిరంతరంగా కొనసాగుతూనే వుంది.

కానీ మన సామాజిక మీడియా కు మాత్రం జగన్ అధికారంలోకి వచ్చేసి అయిదేళ్లు అయిపోయినట్లు, ఏమీ చేయనట్లు కనిపిస్తోంది. కరోనా కనిపించడం లేదు. కోర్టుల ద్వారా అడ్డం పడడాలు కనిపించడం లేదు. పల్లెల్లో జరుగుతున్న ప్రగతి కనిపించడం లేదు. ఏం చేస్తాం..ఆ చూపు అలాంటిది.