కామెడీ హీరో రాజేంద్రప్రసాద్ వెండితెరపై నవ్వుతూ, ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతుంటారు. చిత్రపరిశ్రమలో రాజేంద్రప్రసాద్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉన్నాయి. ప్రస్తుతం భవానీ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్లైమాక్స్’ చిత్రంలో రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రలో నటించారు.
ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మనసులో బాధను బయట పెట్టారు.
తాను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినట్టు చెప్పారు. సినిమాలపై ఆసక్తితో ముందుగా మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనపై శిక్షణ తీసుకున్నట్టు తెలిపారు. నటనలో అద్భుత ప్రతిభ కనబరచడంతో శిక్షణలో భాగంగా గోల్డ్ మెడల్ సాధించానన్నారు.
తాను సినిమాల్లోకి రావాలనుకునే నాటికి హేమాహేమీలైన ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు తదితర అగ్రహీరోలు ఇండస్ట్రీని శాసిస్తున్నట్టు తెలిపారు. దీంతో చిత్రపరిశ్రమలో ప్రవేశించాలన్నా, రాణించాలన్నా ఓ ప్రత్యేకత ఏర్పరచుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఆయన చెప్పారు.
సరిగ్గా అదే సమయంలో చార్లీచాప్లిన్ సినిమాలు చూడడం, ఆయన కామెడీ పాత్రలతో స్ఫూర్తి పొంది, కమెడియన్ హీరోగా అలరించాలని దృఢ నిర్ణయం తీసుకున్నట్టు రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. కామెడీ హీరోగా తనను తాను ఆవిష్కరించుకోడానికి గల నేపథ్యాన్ని ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇక వ్యక్తిగతంగా తనను వెంటాడుతున్న బాధ, ఆవేదనను కూడా ఈ సందర్భంగా ఆయన పంచుకున్నారు. తన అనుకున్న వాళ్ల దగ్గరే డబ్బు విషయంలో తాను మోసపోవడం ఆవేదన కలిగించిందన్నారు.
కొన్ని సంఘటనల తర్వాత తాను ఇంత కాలం సంపాదించిన సొమ్ము ఏమైందని చూసుకుంటే.. అసలు నిజాలు తెలిసి వేదన మిగిలిందన్నారు. దగ్గరి వాళ్ల చేతిలో తాను మోసపోయాననే చేదు నిజం తెలిసొచ్చిందన్నారు. అప్పటికే మోసం చేసిన వాళ్లు వెళ్లిపోయారని రాజేంద్రప్రసాద్ మనసులో గూడు కట్టుకున్న ఆవేదనను బయట పెట్టారు.