హీరోల పారితోషకాల విషయంలో సంచలన నంబర్లు వినిపిస్తూ ఉన్నాయి. సినిమా వసూళ్ల విషయంలో వినిపించే నంబర్లు ఇప్పుడు కేవలం హీరోల పారితోషకాల విషయంలో వినిపిస్తూ ఉండటం గమనార్హం. అధికారిక ప్రకటనలు కానప్పటికీ హీరోల రెమ్యూనరేషన్ల విషయంలో భారీ నంబర్లు చర్చకు దారి తీస్తూ ఉన్నాయి. భారీ పారితోషకాల విషయంలో తమిళ సినిమాల హీరోలు అప్పుడప్పుడు వార్తల్లోకి వస్తూ ఉంటారు.
భారీ నంబర్ ఏదైనా అది తమిళనాడు నుంచినే వినిపించాల్సిందే అనే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఎప్పుడో చంద్రముఖి సమయంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ కు 40 కోట్ల రూపాయల పారితోషకం అందిందనే గాసిప్ ఒకటి షికారు చేసింది. ఆ తర్వాత రోబోతో రజనీకాంత్ మరింత భారీ పారితోషకం అందుకున్నాడని వార్తలు వచ్చాయి. రోబో తర్వాత రజనీ కెరీర్ లోనే ఆ స్థాయి హిట్ లేదు. అయినా భారీ నంబర్లు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి.
తాజా సినిమా *దర్బార్* విషయంలో రజనీకాంత్ పారితోషకం 90 కోట్ల రూపాయలు అనే టాక్ నడుస్తూ ఉంది. ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలు వంద కోట్ల రూపాయల వసూళ్లను అవలీలగానే సాధిస్తున్నాయి. థియేటర్ల వసూళ్లే గాక.. సినిమాలకు అనేక ఆదాయ మార్గాలు సమకూరాయి. పెద్ద హీరోల సినిమాలు హిట్ అనిపించుకుంటే వారి పారితోషకాలు సమకూరడం పెద్ద విషయం కాదనే అంచనాలున్నాయి.
ఇక రజనీకాంత్ కన్నా దూసుకుపోతున్నాడట విజయ్. సన్ నెట్ వర్క్ వాళ్లు తమ తదుపరి సినిమాకు విజయ్ కు ఏకంగా వంద కోట్ల రూపాయల పారితోషకం ఆఫర్ చేశారట! ఇలా రజనీకాంత్ ను విజయ్ అధిగమించబోతున్నాడని గాసిప్స్ షికారు చేస్తున్నాయి. మరి అసలు సంగతేమిటో!