పీ సీతారామాంజనేయులు.. ఏపీ ఏసీబీ డైరెక్టర్ జనరల్. ఇటీవలే ఏసీబీ పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ శాఖ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ఇటీవలే హెల్ప్ లైన్ ను కూడా ప్రారంభించారు జగన్ మోహన్ రెడ్డి. ఆ తర్వాతి చర్యల విషయంలో సమీక్ష నిర్వహించి ఆ శాఖ తీరు సరిగా లేదని జగన్ మోహన్ రెడ్డి కుండబద్ధలు కొట్టారు. ఆ వెంటనే ఏసీబీ డీజీ పదవి నుంచి విశ్వజీత్ బదిలీ జరిగింది. ఇప్పుడు ఏసీబీ డీజీగా నియమితులయ్యారు సీతారామాంజనేయులు.
ఈ ఐపీఎస్ అధికారి ఇటీవలే కొన్ని కీలకమైన వ్యవహారాలను డీల్ చేశారు. అందులో ముఖ్యమైనవి రవాణా శాఖ కమిషనర్ గా ఆయన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు. సరైన పత్రాలు లేకుండా నడుస్తున్న బస్సులకు బ్రేకులు వేయించారు సీతారామాంజేయులు. అందులో ముందు వరసలో జేసీ దివాకర్ రెడ్డి బస్సులు కూడా ఉండటం గమనార్హం.
తమ బస్సులకు సరైన పత్రాలు లేవని స్వయంగా దివాకర్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు. అయితే చూసీచూడనట్టుగా వదిలేయాలన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన రవాణా వ్యవస్థ గురించి మాజీ ఎంపీ అయిన దివాకర్ రెడ్డి అలా మాట్లాడారు. అది తన వ్యాపారం కాబట్టి లొసుగుల గురించి పట్టించుకోకూడదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక జేసీ ఎలా హెచ్చరించారో కూడా తెలిసిన సంగతే.
తమకు వ్యతిరేకంగా పోతే బూట్లు నాకించుకునే పోలీసులను తెచ్చుకుంటా అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కూడా రవాణా శాఖ దివాకర్ రెడ్డి బస్సుల సీజ్ ను కొనసాగించింది. రవాణా శాఖ కమిషనర్ గా సీతారామాంజనేయులు అలా ధీటుగా వ్యవహరించారు. ఇక కోడెల శివప్రసాద్ రావు తనయుడు కోడెల శివరాం రిజిస్ట్రేషన్ల స్కామ్ కూడా సీతారామాంజనేయులు ఆధ్వర్యంలోనే బయటకు వచ్చింది. రవాణా శాఖకు పంగనామాలు పెట్టి కోడెల శివరాం బైకుల అమ్మకం విషయంలో భారీ స్కామ్ కే పాల్పడ్డారు. అందుకు సంబంధించి భారీ ఫైన్ కూడా పడింది. ఇదీ గత ఆరు నెలల్లోనే సీతారామాంజనేయులు ట్రాక్ రికార్డు. ఇప్పుడు ఆయనే ఏసీబీ డీజీగా నియమితం అయ్యారు.